అధికారం మాదే!

8 Feb, 2016 03:20 IST|Sakshi
అధికారం మాదే!

‘రానున్న ఎన్నికల్లో మార్పు తథ్యం... అధికారం మాదే...!’ అని ప్రజా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా తొలి సంతకాలు ఉంటాయని ప్రకటించారు. తదుపరి అవినీతి సొమ్ముతో అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టిన ఆస్తుల్ని జప్తు చేస్తామన్నారు.  
 
* మద్యం , అవినీతి నిర్మూలనే లక్ష్యంగా తొలి సంతకం
* అన్నాడీఎంకే, డీఎంకే అవినీతి ఆస్తుల జప్తు
* ప్రజా కూటమి నేతల ప్రకటన
* మోగిన ‘ప్రజా’ ప్రచార గంట
* ప్రజా స్పందనతో ఆనందం

సాక్షి, చెన్నై : ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ప్రజా సంక్షేమ కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పయనానికి శ్రీకారం చుడుతూ ప్రచార భేరికి ఈ కూటమి నేతలు వైగో, తిరుమావళవన్, జి రామకృష్ణన్, ముత్తరసన్ సిద్ధమయ్యారు.

ఆదివారం కడలూరు వేదికగా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజకీయ మార్పు లక్ష్యంగా ప్రజా చైతన్య పయనం నినాదంతో ఈ ప్రచార భేరి చేపట్టారు. కడలూరులో జరిగిన తొలి ప్రచార సభకు జనం నుంచి అమిత స్పందన రావడంతో ఆ కూటమి వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, చిదంబరంలో జరిగిన మరో  ప్రచార సభకు సైతం జనం తరలిరావడంతో,  ఆరంభం సక్సెస్‌తో ఇక, అధికారం తమదేనన్న ధీమా ఆ కూటమి నేతల్లో నెలకొన్నట్టైంది.
 
అధికారి మాదే : ప్రచార భేరిలో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ప్రసంగిస్తూ, ప్రజా కూటమిని చీల్చేందుకు రక రకాలుగా కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. తొలుత ఇయక్కంగా, తదుపరి కూటమిగా ఆవిర్భవించిన ఈ ప్రజా కూటమి రానున్న ఎన్నికల్లో మెగా విజయంతో అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ శుభగడియలు వచ్చాయని ధీమా వ్యక్తం చేశారు.

అందుకు తగ్గట్టుగానే ఇక్కడకు ప్రజా సమూహం తరలి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు మార్చి మార్చి రాష్ట్రాన్ని గత నలభై ఏళ్లుగా దోచుకుంటూ వచ్చాయని ఆరోపించారు. దోపిడి లక్ష్యంగా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, అయితే, ఆ దోపిడీ సొమ్మును వారి నుంచి లాక్కుని ప్రజలకు ఇచ్చేందుకు తాము ముందుకు వచ్చి ఉన్నామన్నారు.  

ప్రజా హిత కార్యక్రమాలతో ముందుకు సాగుతూ వచ్చిన తమ కూటమి రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికార మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారని, తమ ఓటు ఆయుధంతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధం అయ్యారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం, భావి తమిళనాడును తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రజల్లోకి వచ్చిన తమ కూటమి అధికారంలోకి రాగానే, కీలక నిర్ణయాలకు సిద్ధం అయిందని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకం మద్య నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా ఉంటాయన్నారు. తదుపరి రాష్ట్రాన్ని దోచుకుని అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టుకుని ఉన్న ఆస్తుల్ని జప్తు చేసి, ప్రజలకు పంచడం లక్ష్యంగా తమ పయనం ఉంటుందని ప్రకటించారు.

మరిన్ని వార్తలు