నెల్సన్ మండేలా కన్నుమూత

6 Dec, 2013 07:45 IST|Sakshi
నెల్సన్ మండేలా కన్నుమూత

జోహన్నస్బర్గ్: తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్బర్గ్లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు. దేశం గొప్ప నాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు జాతిపితను పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అధికార లాంఛనాలతో మండేలా అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. జాతీయ పతాకాన్ని సగం అవనతం చేయాలని జుమా ఆదేశించారని బీబీసీ తెలిపింది.

భారత జాతి పిత మహాత్మ గాంధీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నారు. కేప్‌ ప్రాంతంలోని తెంబు వంశానికి చెందిన కుటుంబంలో ఆయన 1918 జూలై 18న జన్మించారు. విద్యార్ధిదశలోనే వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాలకు ఆకర్షితుడై తన జాతి విముక్తి కోసం అంకితమయ్యాడు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతి బహుమతితో సత్కరించింది.

నెల్సన్ మండేలాకు ఆరుగురు సంతానం. ఆయన మూడు సార్లు వివాహం చేసుకున్నాడు. మండేలా మొదటి వివాహం దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారు ఎక్కువగా నివసించే ట్రాన్స్కీ అనే ప్రదేశం నుంచి వచ్చిన ఎంటోకో మేస్‌ అనే మహిళతో జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరు వివాహమైన 13 సంవత్సరాల తరువాత 1957లో అభిప్రాయ భేదాలతో విడిపోయారు. మండేలా రెండవ భార్య విన్నీ మడికిజెలా మండేలా. వీరికి ఇద్దరు కుమార్తెలు. 1992లో వారు విడాకులు తీసుకొన్నారు. 1998లో తన 80వ జన్మదినం సందర్భంగా నెల్సన్‌ మండేలా మూడవసారి గ్రాచా మాచెల్‌ను పెళ్లి చేసుకొన్నారు.

నెల్సన్ మండేలా మరణం పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు. మండేలా నుంచి  స్ఫూర్తి పొందిన వారిలో తాను ఒకడినని తెలిపారు. మండేలా లాంటి నాయకున్ని ప్రపంచం మళ్లీ చూడబోదని సంతాప సందేశంలో ఒబామా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు