అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది..

10 Oct, 2013 00:40 IST|Sakshi
అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ అశోక్ లేలాండ్ నెల రోజుల్లో దోస్త్ ఎక్స్‌ప్రెస్‌ను మార్కెట్లోకి తేనుంది. 13 మంది కూర్చునే వీలున్న ఈ వాహనం గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ధర రూ.5.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మోటార్ భాగస్వామ్యంతో దోస్త్ పేరుతో తేలకపాటి రవాణా వాహనాన్ని అశోక్ లేలాండ్ రూపొందించిన సంగతి తెలిసిందే. దోస్త్ ప్లాట్‌ఫాంపైనే ఎక్స్‌ప్రెస్‌ను అభివృద్ధి చేశారు. అలాగే పార్ట్‌నర్ పేరుతో 5, 6 టన్నుల ట్రక్‌తోపాటు బస్‌లను ఆవిష్కరించనున్నారు. ఇవి జనవరిలో రోడ్లపైకి ఎక్కనున్నాయి. ఆధునిక తేలకపాటి వాణిజ్య వాహనంగా పార్ట్‌నర్‌కు ఇతర దేశాల్లో పేరుంది. ఎన్‌వీ 200 ప్లాట్‌ఫాంపై మరిన్ని వ్యాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుంది.
 
 వాహనాలు కావాల్సిందే..
 మాంద్యం వస్తుంది, పోతుంది. అది సహజం. వాహనాలనేవి ఎప్పటికీ అవసరమని అశోక్ లేలాండ్ లైట్ కమర్షియల్ వెహికిల్స్, డిఫెన్స్ ఈడీ నితిన్ సేథ్ అన్నారు. బుధవారమిక్కడ ‘స్టైల్’ మల్టీ పర్పస్ వాహనాన్ని రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్లు తగ్గితే భారత వాహన మార్కెట్‌లో సంచలనాలు నమోదవుతాయని అన్నారు. కార్ల మార్కెట్లో తాము ప్రవేశించబోమని స్పష్టం చేశారు. వ్యాన్లు, ట్రక్కులు, బస్సులు మాత్రమే తయారు చేస్తామన్నారు. బీపీవో కార్యాలయాలు అధికంగా ఉన్న బెంగళురు, హైదరాబాద్‌లో స్టైల్ వాహనాలకు డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. నిస్సాన్ తయారీ ఎన్‌వీ 200 వాహనం ఆధారంగా స్టైల్‌కు రూపకల్పన చేశారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో స్టైల్ ధర రూ.7.49-9.29 లక్షలుంది.
 
 బహుమతి చేరేనా..
 స్టైల్ వాహనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుమతిగా ఇవ్వాలని అశోక్ లేలాండ్ భావించింది. అయితే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో వాహనాన్ని అందించలేకపోతున్నట్టు కంపెనీ వైస్ చైర్మన్ వి.సుమంత్రన్ చెప్పారు.
 అహ్మదాబాద్‌లో స్టైల్ విడుదల కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కంపెనీ గతంలో దోస్త్ వాహనాన్ని దేవస్థానానికి బహుమతిగా ఇచ్చింది.

మరిన్ని వార్తలు