20 వేల చెప్పులతో నిరసన

1 Dec, 2015 13:34 IST|Sakshi
20 వేల చెప్పులతో నిరసన

పారిస్: భూతాపోన్నతి (క్లైఫై)పై పారిస్‌లో ఓ పక్క ప్రపంచ దేశాధినేతల సమావేశంలో వాడివేడిగా చర్చలు కొనసాగుతుంటే మరోపక్క భూతాపోన్నతికి పెట్టుబడిదారి దేశాలే కారణమంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. క్లైఫైపై ఎప్పుడు, ఎక్కడ సదస్సులు, సమావేశాలు జరిగినా ప్రపంచ పర్యావర పరిరక్షణ కోసం కృషిచేసే స్వచ్ఛంద సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తుంటాయి.

ఈసారి కూడా అవాజ్ అనే ఆన్‌లైన్ ఆర్గనైజేషన్ పారిస్‌లో సోమవారం ప్రారంభమైన భూతాపోన్నతి సమావేశాలకు రెండు లక్షల మందితో నిరసన తెలియజేసేందుకు ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నది. అయితే పారిస్‌ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొని 20 వేల చెప్పులతో వినూత్నంగా నిరసన తెలిపింది. నేడు 175 దేశాల్లో అగ్రరాజ్యాల కర్బన ఉద్గారాలకు వ్యతిరేకంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నాయి.

శిలాజ ఇంధనాలకు స్వస్తి చెప్పాలని, పునరుత్పత్తి ఇంధనాలను, ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని స్వచ్ఛంద సంస్థలు అగ్రదేశాలను డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనాలతో పాటు భారత్‌కు కూడా తన కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలని అవాజ్ ఆర్గనైజేషన్ కోరుతోంది.
 

మరిన్ని వార్తలు