బాబ్రీ విధ్వంసం కేసు; కోర్టుకు బీజేపీ బడానేతలు

30 May, 2017 13:56 IST|Sakshi
బాబ్రీ విధ్వంసం కేసు; కోర్టుకు బీజేపీ బడానేతలు

- అభియోగాల నమోదు అనంతరం 12 మంది నిందితులకు బెయిల్‌ మంజూరు
లక్నో:
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ బడానేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 12 మంది మంగళవారం లక్నోలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అభియోగాల నమోదు అనంతరం నిందితులందరికీ బెయిల్‌ మంజూరయింది.

వాస్తవానికి సోమవారమే విచారణ జరగాల్సిఉన్నా, నిందితుల్లో ఒకరైన సతీశ్‌ ప్రధాన్‌ కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నోలోని విచారణ కోర్టు ఈ కేసును విచారిస్తున్న సంగతి తెలిసిందే.
(తప్పక చదవండి: బాబ్రీ విధ్వంసం; విస్తుపోయే వాస్తవాలు)

అద్వానీతో ఆదిత్య భేటీ: బాబ్రీ కేసులో విచారణ ఎదుర్కొనేందుకుగానూ లక్నో వచ్చిన అద్వానీని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీవీఐపీ గెస్ట్‌హౌస్‌లో జరిగిన భేటీలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు.

మావాళ్లు నిర్దోషులు: బాబ్రీ విధ్వంసం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ నాయకులు నిర్దోషులని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వారంతా కేసుల నుంచి బయటపడతారని ఆశాభావం వ్యక్తంచేశారు.

నేను క్రిమినల్‌ని కాదు: ఈ కేసులో నిందితుల్లో ఒకరైన కేంద్ర మంత్రి ఉమాభారతి లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను క్రిమినల్‌ను కాను. ఎలాంటి తప్పు చెయ్యలేదు’ అన్నారు. గతంలో ఆమె.. రామమందిర నిర్మాణం కోసం ఉరికంబం ఎక్కేందుకైనా సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

బాబ్రీ మసీదు అనొద్దు: బాబ్రీ మసీదును ఆ పేరుతో వ్యవహరించొద్దని, రామజన్మభూమిగా మాత్రమే పిలవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ అన్నారు. మంగళవారం లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబర్‌ విదేశీయుడని, అతను భారతదేశానికి చేసిందేమీలేదని, అందుకే అతిని పేరుతో మసీదును పిలవొద్దని సాక్షి మహారాజ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు