బజాజ్ అలయంజ్ మహిళా బ్రాంచ్

4 Jan, 2014 01:39 IST|Sakshi

 న్యూఢిల్లీ: మహిళా బ్యాంక్ స్ఫూర్తితో బజాజ్ ఆలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందరూ మహిళలుండే శాఖను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. అందరూ మహిళా ఉద్యోగులు ఉండే బీమా కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తొలి బీమా కంపెనీ తమదేనని బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, తపన్ సింఘాల్ తెలిపారు. ఈ బ్రాంచ్ కోసం త్వరలో మహిళా ఏజెంట్లను, ఉద్యోగులను నియమించుకుని, వారికి తగిన శిక్షణనిస్తామని వివరించారు. కుటుంబ బాధ్యత కోసం తమ వృత్తిగత బాధ్యతలను త్యాగం చేసిన మహిళా ఉద్యోగులను నియమించుకుంటామని, వారి కెరీర్‌కు మళ్లీ ప్రారంభాన్నిస్తామని పేర్కొన్నారు.  మొదటగా 5గురు మహిళా ఉద్యోగులు, 10 మహిళ ఏజెంట్లతో పుణే బ్రాంచ్ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే మహిళ ఏజెంట్ల సంఖ్యను 60కు పెంచుతామని వివరించారు. అన్ని మెట్రో నగరాల్లో కూడా త్వరలో ఇలాంటి మహిళా బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తామని తపన్ సింఘాల్ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు