10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

7 Feb, 2014 01:09 IST|Sakshi
10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నారు. వేతన సవరణపై బ్యాంక్ యూనియన్లు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే దీనికి కారణం. యూనియన్లు- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో సమస్యపై తగిన పరిష్కారం కనుగొనలేకపోవడంతో సమ్మె అనివార్యం అయినట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ పేర్కొన్నారు.

 బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఆఫర్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదని బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా అన్నారు.  డిసెంబర్ 14న  వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావడంతో అదేనెల 18వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. 2012 నవంబర్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది.  తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ, అధికారుల యూనియన్లకు యూఎఫ్‌బీయూ నేతృత్వం వహిస్తోంది. దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు