విజృంభిస్తున్న మలేరియా, డెంగీ జ్వరాలు

10 Aug, 2015 00:59 IST|Sakshi
విజృంభిస్తున్న మలేరియా, డెంగీ జ్వరాలు

జనవరి నుంచి ఇప్పటివరకు 1,281 కేసులు నమోదు
* ఈ వారంలోనే 36 డెంగీ కేసుల నిర్ధారణ
* ఇతర జ్వరాలు నాలుగున్నర లక్షలు పైనే నమోదు
* కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జనం జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వాటితో బెంబేలెత్తుతున్నారు.

అలాగే టైఫాయిడ్, అతిసార, కామెర్లు వంటివీ ప్రజలను కలవరపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 1,210 మంది మలేరియా బారిన పడితే... డెంగీతో 71 మంది, చికున్ గున్యాతో 26 మంది బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కించింది.
 
ఈ వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 36 డెంగీ కేసులు నమోదు కాగా అందులో 13 కేసులు హైదరాబాద్‌లోనే రికార్డు కావడం గమనార్హం. ఇవేకాకుండా ఈ ఏడాది 4.5 లక్షల మంది ఇతర రకాల జ్వరాల బారిన పడినట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. అందులో జూన్, జూలై నెలల్లోనే ఏకంగా 2 లక్షల మందికి జ్వరాలు వచ్చినట్లు నమోదైంది. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడం... పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణ, పల్లె ప్రాంతాలు అత్యంత అపరిశుభ్రమైన దుస్థితికి వెళ్లడంతో పరిస్థితి ఘోరంగా మారింది. హైదరాబాద్ నగరంతోపాటు ఆదిలాబాద్ గిరిజన పల్లెల వరకూ వ్యాధుల తీవ్రత మరింత పెరిగింది.
 
మూడు జిల్లాల్లో అత్యధిక కేసులు...
గిరిజన ప్రాంతాలున్న ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 647 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 186, వరంగల్ జిల్లాలో 139 కేసులు రికార్డు అయ్యాయి. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని గిరిజన పల్లెలు మలేరియా సహా ఇతర జ్వరాలతో వణికిపోతున్నాయి. తెలంగాణలో సుమారు 2 వేల మలేరియా పీడిత గ్రామాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందులో వెయ్యి గ్రామాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 870, వరంగల్‌లో 110, మహబూబ్‌నగర్‌లో 20 గ్రామాలున్నట్లు గుర్తించారు.

ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విషజ్వరాల పరిస్థితి ఏజెన్సీ గ్రామాలను వణికిస్తోంది. మరోవైపు అత్యధికంగా హైదరాబాద్‌లో 85 వేల మందికిపైగా జ్వరాల బారినపడ్డారు. అందులో ఎక్కువ జ్వరాలు జూన్, జూలై నెలల్లోనే నమోదైనట్లు చెబుతున్నారు. మెదక్ జిల్లాలోనూ 70 వేల మందికి పైగా జ్వరాల బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. మరో రెండు నెలలపాటు వ్యాధుల సీజన్ ఉండటంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారనుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని అంటువ్యాధుల నివారణ సంస్థ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. మలేరియా నిర్ధారణ కిట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. అవసరమైన మందులను సరఫరా చేసినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు