బీజేపీ నైతిక మద్దతు ఇవ్వచ్చు: మైత్రేయన్

8 Feb, 2017 11:32 IST|Sakshi
బీజేపీ నైతిక మద్దతు ఇవ్వచ్చు: మైత్రేయన్
ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత.. ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన సీనియర్లలో వి.మైత్రేయన్ ఒకరు. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. ఎప్పుడూ తన జేబులో అమ్మ జయలలిత ఫొటో ఉంచుకుంటారు. బుధవారం ఉదయం నేరుగా పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో కూడా ఆయన వెంటే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అమ్మ వారసత్వం కొనసాగాలనే కోరుకుంటున్నారని, ఇలాంటి తరుణంలో రాత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు చూసిన తర్వాత.. పార్టీ మొత్తం ఆయనవెంటే ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని కూడా మైత్రేయన్ అన్నారు. 
 
ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు సానుకూలంగా లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా 'సేఫ్ గేమ్' ప్లే చేయాలనుకుంటున్నారని, పరిస్థితులను బట్టి ఎటు కావాలంటే అటు మొగ్గేందుకు సానుకూలంగా ఉన్నారని మైత్రేయన్ చెప్పారు. తన ఆత్మసాక్షి ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, ఎప్పటికైనా అమ్మకు విశ్వాసపాత్రుడిగానే ఉంటానని చెప్పారు. ఈ తరుణంలో కేంద్రం కావాలంటే నైతిక మద్దతు మాత్రమే ఇవ్వచ్చు గానీ రాజకీయ మద్దతు కాదని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పుడు గానీ, రేపు గానీ ఎమ్మెల్యేలంతా పన్నీర్ సెల్వానికి మద్దతు చెప్పాల్సిందేనని మైత్రేయన్ అభిప్రాయపడ్డారు.
 
బలవంతపు రాజీనామాలపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అందువల్ల సీనియర్ నాయకుడైన గవర్నర్ విద్యాసాగర్ రావు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఎప్పుడు సంక్షోభం వచ్చినా జయలలిత కూడా పన్నీర్ సెల్వాన్నే తనకు విశ్వాసపాత్రుడిగా ఎంచుకుని ఆయనకే పదవి అప్పగించారని మైత్రేయన్ గుర్తుచేశారు. అందువల్ల ఇప్పుడు కూడా పార్టీలో ఆయన వెంటే ఎక్కువ మంది వెళ్తారని అన్నారు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా