పెద్ద నోట్ల రద్దుతో ఒరిగేదేమీ లేదు..

9 Nov, 2016 10:42 IST|Sakshi
పెద్ద నోట్ల రద్దుతో ఒరిగేదేమీ లేదు..
బ్లాక్ మనీపై ఉక్కుపాదం మోపుతూ, పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన సంచలనాత్మక నిర్ణయం వల్ల అంతలా ఒరిగేదేమీ లేదని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) అత్యున్నత స్థాయి అధికారి పేర్కొన్నారు. బ్లాక్ మనీ ఎక్కువగా విదేశీ బ్యాంకుల్లో, విదేశీ కరెన్సీ, గోల్డ్, ఇతర ఆస్తుల రూపంలో ఉంటుందని తెలిపారు. '' బ్లాక్మనీ ఎక్కువగా  విదేశీ కరెన్సీ రూపంలో, బంగారం, ఆస్తుల రూపంలో ఉంటుందని అందరికీ తెలుసు. నగదు రూపంలో బ్లాక్మనీ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. కేవలం ఈ చర్యలు మాత్రమే బ్లాక్మనీని నిర్మూలించడానికి సహకరించవు'' అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్. వెంకటాచలం మంగళవారం రాత్రి తెలిపారు. ఇక నకిలీ నోట్ల వ్యవహారానికి వస్తే, కేవలం ఈ చర్య మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా నకిలీ నోట్ల వ్యవహారంలో మూల కారణాలనే కనుగొనలేకపోతున్నామని చెప్పారు.
 
ప్రభుత్వ ఈ నిర్ణయంతో కొత్త నకిలీ నోట్లు చలామణిలోకి వస్తాయి అని వ్యాఖ్యానించారు. దేశమంతా 102,000ఏటీఎంలు, 85,000 వాణిజ్య బ్యాంకు శాఖలు  10,000 కోపరేటివ్ బ్యాంకు శాఖలు ఉన్నాయని తెలిపారు. ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకు శాఖలకు, ఏటీఎంలకు సప్లై చేయలేకపోతే, వచ్చే 24, 48 గంటల్లో సాధారణ ప్రజానీకానికి కొత్త నోట్ల పంపిణీ సాధ్యం కాదని హెచ్చరించారు. 500, 1000 నోట్ల రద్దుతో సాధారణ ప్రజలు చాలా అవస్థలు పడాల్సివస్తుందన్నారు. కాగ, నిన్న రాత్రి ప్రధాని నరేంద్రమోదీ బ్లాక్మనీపై సర్జికల్ స్టైక్ ప్రకటిస్తూ.. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సాధారణ ప్రజల్లో భయాందోళన నెలకొంది. 500, 1000నోట్లను ఏటీఎంలలో డిపాజిట్ చేసి, 100 రూపాయల నోట్లు తీసుకోవడం కోసం ప్రయత్నించారు. కానీ ఏటీఎంలన్నీ స్ట్రక్ కావడంతో, ప్రజలు రోడ్లపై బారులు తీశారు.     
 
మరిన్ని వార్తలు