బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్‌తో సత్ఫలితాలు: డీజీపీ ప్రసాదరావు

17 Nov, 2013 01:00 IST|Sakshi
బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్‌తో సత్ఫలితాలు: డీజీపీ ప్రసాదరావు

 సాక్షి, హైదరాబాద్: నేర దర్యాప్తులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు అన్న్డారు. మానవ హక్కుల ఉల్లంఘనలను నిరోధించేందుకు ఇదే సరైన మార్గమని చెప్పారు. నేర పరిశోధనలో సత్యశోధనకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్’ విధానం(మెదడులో దాగి ఉన్న కీలక సమాచారాన్ని రాబట్టే ప్రక్రియ)పై శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్)లో ఓ సదస్సు జరిగింది. ఏపీఎఫ్‌ఎస్‌ఎల్, స్వర్ణరక్ష నేతృత్వంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేర నిరూపణలో సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్)కంటే బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ విధానం అత్యంత ఆధునికమైందని చెప్పారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ సహా అభివృద్ధి చెందిన దేశాలలో దర్యాప్తు సంస్థలు దీన్ని అనుసరిస్తున్నాయని తెలిపారు.
 
 ఈ విధానం 90 శాతం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో నేరస్తులను మానసికంగా, శారీరకంగా హింసించకుండా నే నిజాలు రాబట్టడం తేలికవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ మాట్లాడుతూ.. బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియ నేర పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియలో సచ్ఛీలతకు అద్దంపట్టేలా ఈ సరికొత్త విధానం సహకరిస్తుందని ఫోరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టర్ శారద చెప్పారు. పాలీగ్రాఫ్, నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల నిర్వహణను సుప్రీం కోర్టు నిషేధించిందనేది పూర్తిగా వాస్తవం కాదని, నిందితుడి అనుమతి ఉంటే పరీక్షలు నిర్వహించవచ్చని ఆమె తెలిపారు. ఈ సరికొత్త విధానాన్ని ఇప్పటికే అమెరికా విజయవంతంగా అమలు చేస్తోందని మాజీ డీజీపీ, స్వర్ణరక్ష సంస్థ అధినేత స్వరణ్‌జిత్ సేన్ అన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా