చక్కెర మిల్లులకు తీపి కబురు..

20 Dec, 2013 01:14 IST|Sakshi
చక్కెర మిల్లులకు తీపి కబురు..

న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు తీపి కబురు ఇది. చెరకు రైతులకు చెల్లింపులు చేసేందుకు మిల్లులకు రూ.6,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలపై వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.2,750 కోట్ల మేరకు ఉండే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. గురువారం నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తెలిపారు.

ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుంది. షుగర్ మిల్లులకు ఈ రుణాలను బ్యాంకులు సమకూరుస్తాయి. చెరకు రైతులకు చెల్లించడానికి మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. రైతుల పాత బకాయిలనూ తీర్చవచ్చు. గత మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలలిస్తారు. వీటిని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. రుణ చెల్లింపుపై తొలి రెండేళ్లు మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మూడో ఏట నుంచి రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు.
 
 పరిమాణపరంగా ఎలాంటి ఆంక్షల్లేకుండా పంచదార ఎగుమతులను కొనసాగించాలన్న ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. దేశీయ మార్కెట్లో అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ చెప్పారు.
 
 బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తికి అనుమతి
 తమ అధీనంలోని బొగ్గు గనుల సహజ వాయువు ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు లెసైన్స్ ఇవ్వాలని సీసీఈఏ నిర్ణయించింది. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు గనుల్లో కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ, ఉత్పత్తికి అనుమతించినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు.
 
 ఆహార భద్రతా ప్రణాళిక, వాణిజ్య సహకార ఒప్పందాలపై ఇటీవలి డబ్ల్యుటీఓ సదస్సులో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సీసీఈఏ సమర్థించింది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలపై శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ అంశాన్ని సవాలు చేయరాదని బాలిలో జరిగిన డబ్ల్యుటిఓ సదస్సులో నిర్ణయించారు.

మరిన్ని వార్తలు