సీ(మ్)న్ మారింది! | Sakshi
Sakshi News home page

సీ(మ్)న్ మారింది!

Published Fri, Dec 20 2013 1:12 AM

ఇషాంత్ శర్మ

మూడో రోజు ఆట మ.గం. 2.00 నుంచి టెన్ క్రికెట్‌లో
 ప్రత్యక్ష ప్రసారం
 
 సొంత గడ్డపై బౌన్స్, ఫాస్ట్ వికెట్లతో ప్రత్యర్థిని ఆడుకోవడం దక్షిణాఫ్రికాకు అలవాటు...ఇప్పుడు భారత బౌలర్లు సీన్ మార్చేశారు. దానిని తమకు అనుకూలంగా మార్చుకొని చెలరేగారు. స్ఫూర్తిదాయక బౌలింగ్‌తో ఇషాంత్ చెలరేగితే...షమీ, జహీర్ అతడిని అనుసరించారు. భారత బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా ఉందని మన పేసర్లు నిరూపించారు. అద్భుత బంతులతో సఫారీ ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశారు. యువ భారత ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చెల్లాచెదురైంది. ఆఖర్లో కొంత పట్టు విడిచినా...ఇప్పటికీ తొలి టెస్టులో ధోనిసేనదే ఆధిక్యం.
 
 జొహన్నెస్‌బర్గ్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. గురువారం రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. గ్రేమ్ స్మిత్ (119 బంతుల్లో 68; 11 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. స్మిత్, ఆమ్లా రెండో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా 130/1 స్కోరుతో ఒక దశలో మెరుగైన స్థితిలో నిలిచింది.
 
 
 అయితే మన పేసర్ల ధాటికి 16 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఫిలాండర్ (76 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు), డుప్లెసిస్ (55 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఇషాంత్ శర్మ 3 కీలక వికెట్లు తీయగా, షమీ 2, జహీర్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకే ఆలౌటైంది. రెండో రోజు 13 ఓవర్లు ఆడిన ధోని సేన కేవలం 25 పరుగులు జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది.
 
 కట్టడి చేసిన ఫిలాండర్...
 ముందు రోజు రాత్రి కురిసిన వర్షంతో పాటు ఆరంభంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో పరిస్థితులను దక్షిణాఫ్రికా బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి రోజుతో పోలిస్తే ఆఫ్‌స్టంప్‌కు మరింత దగ్గరగా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఫలితంగా పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించిన భారత్ తొలి ఎనిమిది ఓవర్లలో 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ 99వ ఓవర్‌లో ఇబ్బంది పడిన ధోని (19) అదే ఓవర్ చివరి బంతిని దూరం నుంచి ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం చక్కటి బంతులతో ఫిలాండర్ చెలరేగాడు. ఓవర్‌నైట్ స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జోడించిన రహానే (137 బంతుల్లో 47; 8 ఫోర్లు) వికెట్ కీపర్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా...మరుసటి బంతికే జహీర్ (0) కూడా ఎల్బీగా అవుటయ్యాడు.

 ఫిలాండర్ హ్యట్రిక్‌ను నిరోధించగలిగినా, అతని తర్వాతి ఓవర్లోనే ఇషాంత్ (0) బౌల్డయ్యాడు. ఆ వెంటనే షమీ (0)ను అవుట్ చేసి మోర్కెల్ భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. తొలి రోజు ఆటను బట్టి చూస్తే భారీ స్కోరుపై ఆశలు రేపిన టీమిండియా రెండో రోజు 13 ఓవర్లకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా లంచ్ సమయానికి 10 ఓవర్లు ఆడి 22 పరుగులు చేసింది. జహీర్, షమీ బౌలింగ్‌లో కొన్ని ఉద్విగ్న క్షణాలు ఎదుర్కొన్నా...సఫారీ ఓపెనర్లు జాగ్రత్తగా సెషన్‌ను ముగించారు.
 
 స్మిత్‌కు కలిసొచ్చిన అదృష్టం...
 లంచ్ విరామం తర్వాత నాలుగో ఓవర్ తొలి బంతికే ఇషాంత్ భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్‌పై పడి దూసుకొచ్చిన బంతిని ఆడలేక అల్విరో పీటర్సన్ (21) ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే మరో రెండు ఓవర్ల తర్వాత అదృష్టం స్మిత్ పక్షాన నిలిచింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ మరోసారి తన ప్రియమైన శత్రువు జహీర్ బౌలింగ్‌లోనే వెనుదిరిగే అవకాశం వచ్చినా అశ్విన్ దానిని నేలపాలు చేశాడు. 19 పరుగుల వద్ద స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో అశ్విన్ వదిలేశాడు. దీనిని ఉపయోగించుకున్న అతను ఆమ్లాతో కలిసి చక్క టి భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు స్వేచ్ఛగా ఆడటంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. స్మిత్ 98 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
 
 27 బంతుల్లో మారిన కథ...
 టీ విరామం భారత బౌలర్లలో కొత్త శక్తిని తెచ్చినట్లుంది. మూడో సెషన్ నాలుగో ఓవర్లో ఇషాంత్ మ్యాజిక్ మొదలు పెట్టాడు. ఆఫ్ స్టంప్ నుంచి లోపలికి వచ్చిన బంతిని అంచనా వేయడంలో ఆమ్లా (74 బంతుల్లో 36; 6 ఫోర్లు) విఫలమయ్యాడు. ఆడకుండా వదిలేయడంతో అది వికెట్లను గిరాటేసింది. ఆ తర్వాతి బంతికే సీనియర్ ఆటగాడు కలిస్ (0) వెనుదిరిగాడు. షాట్ ఆడటంలో ఆలస్యం చేయడంతో అతను ఎల్బీగా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లు ఒక్కసారిగా జట్టులో ఉత్సాహం నింపాయి.
 
 తర్వాతి ఓవర్లోనే జహీర్, స్మిత్‌పై తన అద్భుత రికార్డును కొనసాగించాడు. అనూహ్యంగా స్వింగ్ అయిన బంతిని ఆడటంతో తడబడిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఒకే స్కోరు వద్ద సఫారీ జట్టు ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు కోల్పోవడం విశేషం. మరో నాలుగు ఓవర్లు ముగిశాయి. ఈ సారి షమీ వంతు వచ్చింది. టీ తర్వాత షమీ వేసిన తొలి బంతిని డుమిని (2) ఆడలేక స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. రెండు బంతులకే కీలక వికెట్ భారత్ చేజిక్కింది. షమీ వేసిన చక్కటి బంతిని డివిలియర్స్ (13) బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
 
 ఆదుకున్న భాగస్వామ్యం...
 భారత బౌలర్ల జోరు తర్వాత దక్షిణాఫ్రికా స్కోరు 146/6 వద్ద నిలిచింది. సఫారీల ఇన్నింగ్స్ ఇక ఎంతో సేపు సాగదని అనిపించింది. అయిత ఈ దశలో ఫిలాండర్, డుప్లెసిస్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఆట ముగియడానికి రెండు ఓవర్ల ముందు షమీ బౌలింగ్‌లో ప్లెసిస్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ వదిలేయడంతో భారత్‌కు మరో అవకాశం చేజారింది. భారత్ వేసిన 66 ఓవర్లలో 6 మాత్రమే స్పిన్నర్ అశ్విన్ వేశాడంటే మన పేసర్లు ఎంత చక్కగా బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.
 
 తొలి సెషన్
 ఓవర్లు:     23
 పరుగులు: 47
 వికెట్లు:     5
 
 రెండో సెషన్
 ఓవర్లు:    25
 పరుగులు: 96
 వికెట్లు:     1
 
 మూడో సెషన్
 ఓవర్లు:     31
 పరుగులు: 95
 వికెట్లు:    5
 
 ‘విదేశీ గడ్డపై బౌలింగ్ అంటే ఉపఖండంలో వేసిన దానికి వ్యతిరేకంగా శైలి మార్చుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన ఓపికతో సరైన ప్రాంతంలో బంతులు విసరగలిగాను. అలాగే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. జట్టులోని మిగతా సీమర్లు కూడా విశేషంగా రాణించారు. అందుకే ప్రత్యర్థి ఆటగాళ్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. నేటి (శుక్రవారం) ఆటలోనూ ఇదే రీతిన చెలరేగి ఐదు వికెట్ల ఘనతను సాధించాలని ఆశిస్తున్నాను’
 - ఇషాంత్
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 6; ధావన్ (సి) తాహిర్ (బి) స్టెయిన్ 13; పుజారా (రనౌట్) 25; కోహ్లి (సి) డుమిని (బి) కలిస్ 119; రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) ఫిలాండర్ 14; రహానే (సి) డివిలియర్స్ (బి) ఫిలాండర్ 47; ధోని (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 19; అశ్విన్ (నాటౌట్) 11; జహీర్ (ఎల్బీ) (బి) ఫిలాండర్ 0; ఇషాంత్ (బి) ఫిలాండర్ 0; షమీ (బి) మోర్కెల్ 0; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (103 ఓవర్లలో ఆలౌట్) 280.
 వికెట్ల పతనం: 1-17; 2-24; 3-113; 4-151; 5-219; 6-264; 7-264; 8-264; 9-278; 10-280.
 
 బౌలింగ్: స్టెయిన్ 26-7-61-1; ఫిలాండర్ 27-6-61-4; మోర్కెల్ 23-12-34-3; కలిస్ 14-4-37-1; తాహిర్ 8-0-47-0; డుమిని 5-0-30-0.
 
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (ఎల్బీ) (బి) జహీర్ 68; పీటర్సన్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 21; ఆమ్లా (బి) ఇషాంత్ 36; కలిస్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 0;  డివిలియర్స్ (ఎల్బీ) (బి) షమీ 13; డుమిని (సి) విజయ్ (బి) షమీ 2; డుప్లెసిస్ (బ్యాటింగ్) 17; ఫిలాండర్ (బ్యాటింగ్) 48; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (66 ఓవర్లలో 6 వికెట్లకు) 213.
 
 వికెట్ల పతనం: 1-37; 2-130; 3-130; 4-130; 5-145; 6-146.
 బౌలింగ్: జహీర్ 22-4-72-1; షమీ 18-3-48-2; ఇషాంత్ 20-4-64-3; అశ్విన్ 6-0-25-0.

Advertisement
Advertisement