ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్

14 Jan, 2014 00:41 IST|Sakshi
ద్రవ్యోల్బణంపైనే సెంట్రల్ బ్యాంకుల దృష్టి సరికాదు: మాంటెక్

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం కట్టడే ప్రధాన లక్ష్యంగా సెంట్రల్ బ్యాంకులు పనిచేయడం సరికాదని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సోమవారం పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ బ్యాంకులు పలు అంశాలు లక్ష్యంగా పనిచేయాల్సి ఉంటుందన్నది తన అభిప్రాయమని అన్నారు. 

రఘురామ్ రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత, ద్రవ్యోల్బణమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ రెండుసార్లు రెపో రేటు పెంచిన నేపథ్యంలో మాంటెక్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి క్షీణదశలో నడుస్తున్న నేపథ్యంలో-  జనవరి 28వ తేదీన ఆర్‌బీఐ తన మూడవ త్రైమాసిక పరపతి విధాన సమీక్షను నిర్వహించనుంది. ఆర్థిక రంగంలో సంస్కరణల ప్రక్రియ కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. రూపాయి ప్రస్తుతం (సోమవారం 61.52 వద్ద స్థిరపడింది) తన వాస్తవ విలువ దగ్గరగా ఉందని మాంటెక్ తెలిపారు.

మరిన్ని వార్తలు