ఇక సభలు పెడతా: చంద్రబాబు

17 Nov, 2013 00:33 IST|Sakshi
ఇక సభలు పెడతా: చంద్రబాబు

తిరుపతిలో తొలి సభ పెట్టనున్నట్టు వెల్లడి
 విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పడు ముఖ్యమంత్రి ఏం చేశారని ధ్వజం
 జగన్‌పై యథాప్రకారం ఆరోపణలు

 
 సాక్షి, హైదరాబాద్: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. తిరుపతిలో తొలి బహిరంగసభను నిర్వహిస్తామన్నారు. టీ డీపీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని, అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాక విభజన ప్రక్రియను తెరపైకి తెచ్చాయని ఆరోపించారు. ఇదేవిషయాన్ని బహిరంగసభల్లో ప్రజలకు వివరిస్తామన్నారు.
 
  ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన  విషయంలో ప్రధానమంత్రి రెండేళ్లక్రితం ఇదేరోజున చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని తప్పుపట్టారు. తెలంగాణ అంశం క్లిష్టమైనదని, దీనిపై భాగస్వాములందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నాడు ప్రధాని చెప్పారని, కానీ ఆ మాటకు ఎందుకు కట్టుబడలేదని ఆయన ప్రశ్నించారు. సమన్యాయమంటే అదేమైనా బ్రహ్మపదార్థమా అని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, అసలాయనకు బ్రహ్మపదార్థమంటే అర్థం తెలుసా? అంటూ అర్థాలను వివరించారు. ఆంగ్లం బాగా వచ్చనుకునే జైపాల్‌రెడ్డి ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. సమైక్యవాదినని చెప్పుకునే సీఎంకు తెలియకుండా విభజనకు అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం నుంచి కేంద్రానికి నివేదికలెలా వెళతాయని ప్రశ్నించారు.
 
 ఒకవేళ సీఎంకు తెలియకుండా కేంద్రం నివేదికలు తెప్పించుకుంటే.. అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇపుడు సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం సీడబ్ల్యూసీ విభజనకనుకూలంగా నిర్ణయం తీసుకున్నపుడు, రూట్‌మ్యాప్ తయారుచేసే బాధ్యతను అప్పగించినపుడు ఏంచేశారో చెప్పాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీని విలీనం చేసే విషయమై కాంగ్రెస్‌తో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లారని బాబు ఆరోపించారు. ఇదిలా ఉండగా తొలి బహిరంగ సభను ఈ నెల 21న నిర్వహించాలని పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 22న నెల్లూరు, 23న ప్రకాశం, 24న గుంటూరు, 25న కృష్ణా, 26న హైదరాబాద్‌లలో సభలు నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీలో జరిగే పరిణామాలనుబట్టి ఈ సభలను కొనసాగించాలా లేక వాయిదా వేయాలా అనేది నిర్ణయిస్తారు.  ఈ నెల 18, 19 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
 
 మీకెంతమంది పిల్లలు...
 విలేకరుల సమావేశానికి హాజరైన ఓ మహిళా విలేకరి.. ఇంతకు మీరు విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా? అని ప్రశ్నించగా.. ఆయన వెంటనే మీకెంతమంది పిల్లలని ఎదురుప్రశ్నించారు. ఆ ప్రతినిధి తనకు పిల్లలు లేరని జవాబిచ్చారు. మీకు పిల్లలు లేకపోతే సరే, మీ తండ్రికి ఎందరు పిల్లలు, ఒకవేళ ఇద్దరుంటే ఒకరికి అనుకూలంగా వ్యవహరించరుకదా అని ఆయన అన్నారు. ‘2011 నవంబర్ 16న ప్రధాని చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్న మీరు 2012 సెప్టెంబర్ 26న తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలంటూ ప్రధానికి లేఖ రాశారు. తదుపరి అదేఏడాది డిసెంబర్ 28న కేంద్రం నిర్వహించిన అఖిలపక్షానికి పార్టీ ప్రతినిధులుగా కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడును పంపి తెలంగాణకు అనుకూలమని చెప్పించారు కదా’ అని ప్రశ్నించగా.. బాబు జవాబు దాటేశారు. చంద్రబాబు విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాలద్వారా సమాచారం సేకరించిన మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ సాక్షిని అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేది.
 
 రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై వైఎస్సార్‌సీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు మీ పార్టీ మద్దతునిచ్చి ఉంటే ఆ ప్రభుత్వం పడిపోయేది. ఈ విభజన సమస్య వచ్చేదే కాదు కదా? అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడి ఇప్పుడు టీడీపీని దెబ్బతీయడానికి విభజన చేస్తున్నారని ఎలా అంటారు?
 
 రాష్ట్ర విభజనకు మీరు అనుకూలమా, వ్యతిరేకమా? సమన్యాయానికి డిక్షనరీలు వెతికి అర్థం చెప్తున్న మీరు తాజాగా జీవోఎం భేటీకి వెళ్లి అదే విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అంటే విభజనకు అనుకూలంగా మీరిచ్చిన లేఖకు కట్టుబడినట్టే కదా, అలాంటప్పుడు ఇక సమన్యాయమేంటీ?
 
 పార్టీని కాపాడే సలహాలివ్వరూ !
 సినీప్రముఖులను కోరిన బాబు
 వచ్చే సాధారణ ఎన్నికలు తెలుగుదేశానికి చావో, రేవో అయిన నేపథ్యంలో పార్టీని కాపాడుకునే సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు  సినీ ప్రముఖులను కోరారు. శనివారం ఆయన సినీ రంగానికి చెందిన కె. రాఘవేంద్రరావు, చలసాని అశ్వనీదత్, అశోక్ కుమార్ తదితరులతో సమావేశమయ్యారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో చేపట్టాల్సిన ప్రచారం తీరు తెన్నులు, తాను ఓటర్లతో ఎలా వ్యవహరించాలి, ఈ నెల 21 నుంచి నిర్వహించే బహిరంగ సభల గురించి వారితో చర్చించారు. గతంలో ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు ముందుకూడా  ప్రజల తో ఎలా నడుచుకోవాలి, హావభావాలు ఎలా ఉండాలి అనే విషయమై ప్రముఖ దర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్, శ్రీనువైట్ల తదితరులతో చంద్రబాబు భేటీ అయి  సలహాలు, సూచనలు తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు