చిదంబర ఆర్థిక మథనం!

20 Aug, 2013 01:49 IST|Sakshi
చిదంబర ఆర్థిక మథనం!

న్యూఢి ల్లీ: రూపాయి మారకం కొత్త కనిష్ట స్థాయిలకు పడిపోతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆర్థిక మంత్రి పి. చిదంబరం సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎకానమీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో రెవెన్యూ, ఆర్థిక సర్వీసులు, డిజిన్వెస్ట్‌మెంట్ తదితర విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. వివిధ  విభాగాల పనితీరును సమీక్షించడంతో పాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను చిదంబరం కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో చర్చించినట్లు వివరించాయి. నేడు (మంగళవారం) ఆర్థిక వ్యవహారాల విభాగం అధికారులతో చిదంబరం సమావేశం కానున్నారు.
 
  రూపాయి మారకం విలువ 63.13కి పడిపోయిన నేపథ్యంలో చిదంబరం సమీక్షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీ కరెన్సీ తరలిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోతోంది. ఈ దిశగా దేశీ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, భారతీయులు విదేశాలకు పంపే రెమిటెన్సులు మొదలైన వాటిపై ఆర్‌బీఐ ఈ నెల 14న ఆంక్షలు విధించింది. మరోవైపు, భారీగా పెరిగిపోతున్న క్యాడ్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం పసిడి తదితర నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులపై సుంకాలు పెంచడం వంటి చర్యలు తీసుకుంది. భారత్‌కి ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటు, క్యాడ్‌ను బట్టి చూస్తే రూపాయిపై ఒత్తిడి తప్పదని, దేశీ కరెన్సీ పతనం అవుతుందని చిదంబరం గతంలో చెప్పారు.

మరిన్ని వార్తలు