సద్దాం, జిహాద్‌.. పేర్లు పెడితే అంతే సంగతులు

25 Apr, 2017 16:39 IST|Sakshi
సద్దాం, జిహాద్‌.. పేర్లు పెడితే అంతే సంగతులు

చైనాలో ఇస్లామిక్‌ పేర్లపై ఉక్కుపాదం!

బీజింగ్‌(చైనా): ముస్లిం జనాభా ప్రాబల్యముండే జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో చైనా సర్కారు తాజాగా సరికొత్త ఆంక్షలు విధించింది. సద్దాం, జిహాద్‌ వంటి డజన్లకొద్ది ఇస్లామిక్‌ పేర్లను నిషేధించింది. ఈ పేర్లు పెట్టుకోవడం వల్ల ’మత అభిమానం’ పెరిగిపోవచ్చునంటూ కమ్యూనిస్టు చైనా ఈ చర్య తీసుకుంది. జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో ఉయ్‌గుర్‌ తెగకు చెందిన ముస్లిం ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ తమను చైనా అణచివేస్తున్నదంటూ ఈ తెగవారు కొన్నాళ్లుగా హింసాత్మక ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తెగ ప్రజలు తమ పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టకూడదో వివరిస్తూ తాజాగా చైనా ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధించిన ఈ పేర్లు పెడితే విద్యతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలు వారికి వర్తించబోవని, స్కూళ్లలో ప్రవేశం లభించదని అక్కడి ప్రముఖ మానవ హక్కుల సంస్థ అయిన హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌(హెచ్‌ఆర్‌డబ్ల్యూ) తెలిపింది.

ప‍్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సాధారణంగా పిల్లలకు ఇలాంటి పేర్లే పెట్టుకుంటారని, ఇలాంటి పేర్లపై నిషేధం విధించటం తగదని అది పేర్కొంది. ఇలాంటి పేర్లు మత అభిమానాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయనటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనాలో ఇస్లాం, ఖురాన్‌, మక్కా, జిహాద్‌, ఇమాం, సద్దాం, హాజీ, మదీనా వంటి పేర్లను పెట్టుకోరాదంటూ అధికార కమ్యూనిస్టు పార్టీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇలాంటి పేర్లతో ఉన్న వారి పేరిట ఎలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఉండవు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఇతర పౌర సేవలు వారికి లభించవు.
 

మరిన్ని వార్తలు