టిబెట్‌లో భారీ సైన్యం: చైనా యుద్ధ సన్నాహాలా??

19 Jul, 2017 13:18 IST|Sakshi
టిబెట్‌లో భారీ సైన్యం: చైనా యుద్ధ సన్నాహాలా??

న్యూఢిల్లీ: సిక్కింలోని సరిహద్దుల్లో భారత సైన్యంతో ప్రతిష్టంభన నేపథ్యంలో గత నెల చివర్లోనే చైనా భారీగా ఆయుధసంపత్తిని, ఆర్మీ వాహనాలను, బలగాలను టిబెట్‌కు తరలించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌తో సరిహద్దు అంశాలను చూసుకొనే పశ్చిమ థియేటర్‌ కమాండ్‌కు పెద్ద ఎత్తున ఈ సైనిక ఆయుధ సంపత్తి రోడ్డు, రైలు మార్గాల ద్వారా తరలినట్టు తాజాగా మీడియా కథనాలు వెల్లడించాయి.

‘వెస్ట్‌ థియేటర్‌ కమాండ్‌ పరిధిలోకి వచ్చే ఉత్తర టిబెట్‌లోని కున్‌లన్‌ పర్వతప్రాంతాల్లోకి అత్యంత భారీ సైనిక సంపత్తిని బట్వాడా చేశారు. కల్లోలిత జిన్‌జియాంగ్‌, టిబెట్‌తోపాటు భారత్‌తో సరిహద్దు అంశాలను వెస్ట్‌ థియేటర్‌ కమాండ్‌ చూసుకుంటుంది’ అని హంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పత్రిక పేర్కొంది. గత నెలలోనే సైనిక హార్డ్‌వేర్‌ను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) టిబెట్‌ తరలించిందంటూ పీఎల్‌ఏ అధికారిక పత్రికను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. సిక్కింకు సమీపంలోని డొక్లామ్‌ ప్రాంతంలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితి నెలకొన్న నాటినుంచి చైనా మీడియా పరుషమైనరీతిలో యుద్ధవ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.