ఆ చానెల్‌ను మూసివేయండి!

23 Jun, 2017 16:07 IST|Sakshi



దుబాయ్‌: ఖతార్‌ను బహిష్కరించిన సోదరు అరబ్‌ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'అల్‌ జజీరా' టీవీ చానెల్‌పై పడ్డాయి. 'అల్‌ జజీరా' చానెల్‌ను వెంటనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశాయి. ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్నదనే ఆరోపణలతో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఈఏ), ఈజిప్టు, బ్రహెయిన్‌ దేశాలు ఖతార్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ తమతో దౌత్యసంబంధాలు పునరుద్ధరించుకోవాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 13 డిమాండ్ల జాబితాను ఆయా దేశాలు ఖతార్‌కు అందజేశాయి.

అందులో ఖతార్‌ కేంద్రంగా నడిచే 'అల్‌ జజీరా' చానెల్‌ను మూసివేయాలన్న డిమాండ్‌ కూడా ఉంది. అంతేకాకుండా తమ బద్ధ శత్రువైన ఇరాన్‌తో దౌత్య సంబంధాలు తెంపుకోవాలని, ముస్లిం అతివాద గ్రూపులైన ముస్లిం బ్రదర్‌హుడ్‌, ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ కాయిదా, హిజ్బుల్లా, సిరియాలోని జభాత్‌ ఫతే అల్‌ షామ్‌ తదితర సంస్థలతో సంబంధాలు ఉండరాదని డిమాండ్‌ చేశాయి. ఖతార్‌లోని టర్కీ సైనిక స్థావరాన్ని సైతం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ డిమాండ్లపై ఖతార్‌ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి

మరిన్ని వార్తలు