‘దామరచర్ల’పై నేడు కీలక నిర్ణయం!

18 Dec, 2015 01:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 4000 (5x800) మెగావాట్ల సామర్థ్యమున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంతో పాటు దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు పర్యావరణ అనుమతులు జారీ చేసే అంశంపై ఢిల్లీలో పర్యావరణ శాఖ నిపుణుల మదింపు కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.

యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదిత స్థలంలోనే నిర్మించేందుకు అనుమతిస్తే తక్షణమే ప్రాథమిక అనుమతులు జారీ కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను-టీఓఆర్)నే ప్రాథమిక అనుమతులుగా పరిగణిస్తారు. గత అక్టోబర్ 29న చివరిసారిగా దామరచర్ల ప్లాంట్‌పై సమావేశమైన నిపుణుల కమిటీ అనుమతుల జారీ అంశాన్ని తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం నుంచి అన్నమేరువాగు వెళ్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు నిపుణులతో కూడిన సబ్ కమిటీ ఇటీవల దామరచర్లలో ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించింది. ఈ సబ్ కమిటీ సమర్పించిన అధ్యయన నివేదికలోని సిఫారసులే శుక్రవారం నాటి సమావేశంలో కీలకంగా మారనున్నాయి.

ప్రతిపాదిత స్థలంలో ప్రస్తుత డిజైన్ లే అవుట్‌కు అనుగుణంగా ప్రాజెక్టును నిర్మించాలా? లేక లే అవుట్‌లో మార్పులతో అదే స్థలంలో నిర్మించాలా? లేక స్థలాన్ని మార్చాలా? అన్న అంశాలపై నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేవని తెలంగాణ జెన్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. అనుమతులపై అన్నమేరువాగు ప్రభావం ఏమాత్రం ఉండదని స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు