లోకల్ సినిమాలకు 'దంగల్' షాక్

27 Dec, 2016 14:05 IST|Sakshi
లోకల్ సినిమాలకు 'దంగల్' షాక్

తమిళనాడు, కేరళలోనూ మెరుపులు


ఊహించినట్టుగానే ఆమిర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్' దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' తర్వాత అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. తొలి మూడురోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 106.95 కోట్లు సాధించింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ రూ. 60.99 కోట్లు (9మిలియన్ డాలర్లు) కొల్లగొట్టింది. మొత్తంగా మొదటి వీకెండ్ లో 167.94 కోట్లను ఆమిర్  'దంగల్' తన ఖాతాలో వేసుకుంది.

అయితే, ఎవరూ ఊహించనిరీతిలో తమిళనాడు, కేరళలోనూ 'దంగల్' కలెక్షన్లలో మెరుపులు మెరిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో హిందీ సినిమాలకు దేశంలోనే అత్యంత తక్కువ మార్కెట్ ఉంది. తమిళనాడులో ఈ సినిమా తమిళ డబ్బింగ్ వర్షన్ 153 థియేటర్లలో, హిందీ వెర్షన్ 24 థియేటర్లలో విడుదలైంది. తమిళనాడు బీ, సీ కేంద్రాల్లోకి చొచ్చుకుపోయి మరీ ఈ సినిమా తొలి మూడు రోజుల్లో అనూహ్య వసూళ్లు సాధించింది. తొలి వీకెండ్ ఏకంగా రూ. 3.27 కోట్లు వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ లో విడుదలైన కేరళలోనూ తొలి వీకెండ్ రూ. 2.10 కోట్లు వసూలుచేసింది.

ఇక తమిళనాడులో 'దంగల్' లోకల్ సినిమాలకు ఓపెనింగ్ వసూళ్లతో షాక్ ఇచ్చింది. తమిళంలో నేరుగా విడుదలైన విశాల్ 'కత్తి సందై', శశికుమార్ 'బల్లే వెలైయ థెవ్వా' సినిమాల కన్నా 'దంగల్'కు మంచి వసూళ్లు దక్కడం సినీ పరిశీలకులను విస్మయ పరుస్తోంది. ఆమిర్ 'దంగల్' ను బిగ్ స్ర్కీన్లలో ఎక్కువగా ప్రదర్శించడం కూడా వసూళ్లు పెరగడానికి కారణమని, కానీ, చిన్న పట్టణాలలోనూ ఈ సినిమా తమిళ డబ్బింగ్ బాగా ఆడుతోందని, దీంతో ప్రారంభ వసూళ్లలో విశాల్ సినిమాపై 'దంగల్' ఆధిపత్యం చూపించినట్టు అయిందని ఎగ్జిబీటర్లు చెప్తున్నారు.
 

మరిన్ని వార్తలు