యాదాద్రిలో భక్తుల కిటకిట

13 Jul, 2015 02:52 IST|Sakshi
యాదాద్రిలో భక్తుల కిటకిట

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వసతిగదులు నిండిపోవడంతో భక్తులు ఆరుబయట సేదదీరారు. ధర్మదర్శనం, టికెట్ దర్శనాల క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. ఘాట్‌రోడ్డుపై వాహనాల ట్రాఫిక్ జాం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని తులసీ కాటేజీ మీదుగా కొండపైకి వాహనాలను అనుమతించారు. స్వామివారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఏకాదశి సందర్భంగా అర్చకులు స్వామి, అమ్మవార్లకు లక్షతులసీ అర్చన నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో  అభిషేకం చేశారు. పట్టువస్త్రాలు ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక సేవలో అధిష్టింపజేసి తిరువీధులలో ఊరేగించారు.
 
 పుష్కరాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

 ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగుముఖంలో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సందర్శిస్తారు. దీంతో అధికారులు కొండపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంచినీటి కుళాయిలను, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. విష్ణు పుష్కరిణిలోని నీటిని బ్లీచింగ్ వేసి శుభ్రపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు