ఆ కార్లతో ఉద్యోగాలు పోతాయా?

26 Jul, 2017 16:12 IST|Sakshi
ఆ కార్లతో ఉద్యోగాలు పోతాయా?

న్యూఢిల్లీ: గత ఏప్రిల్‌ నెలలో ‘జనరల్‌ మోటార్స్‌’ను కూడా అధిగమించిన అమెరికా కార్ల కంపెనీ ‘తెల్సా’ డ్రైవర్‌ రహిత కార్ల సాంకేతిక పరిజ్ఞానంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాలు నిర్వహిస్తున్న డెయిమ్‌లర్, డైటర్, జట్చే, గూగుల్, ఆపిల్‌ కంపెనీల కన్నా తెల్సా ఎంతో ముందుంది. అయినప్పటికీ బొత్తిగా డ్రైవర్‌ అవసరం లేకుండా పూర్తిగా దానంతట అదే నడిచే కార్లు వినియోగదారుడి వద్దకు చేరాలంటే ఎంత లేదన్నా ఇంకా దశాబ్ద కాలం పడుతుంది. ట్రాఫిక్‌ సెన్స్‌ లేకుండా అడ్డదిట్టంగా నడిచే వాహనాల మధ్య, గుంతలుపడి అధ్వాన్నంగా ఉండే భారతీయ రోడ్లపైకి ఈ డ్రైవర్‌ రహిత కార్లు రావాలంటే మరో రెండు దశాబ్దాలు కావాల్సిందే. అప్పటివరకు ఆగకుండా మన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీగారు కంగారుపడి కోట్ల మంది డ్రైవర్ల ఉద్యోగాలను కొల్లగొట్టే డ్రైవర్‌ రహిత వాహనాలను భారత్‌లో అనుమతించే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు.
 
డ్రైవర్‌ రహిత కార్లపై గడ్కరి ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థమేమైనా ఉందా? కార్లు లేనప్పుడు బండ్లు, రిక్షాలు, టాంగాలపై ప్రజలు ప్రయాణించారు. వాటిని నడిపే మనుషుల పొట్ట కొట్టుతాయనుకుంటే నేడు కార్లు వచ్చేవా? భారత్‌లో వాషింగ్‌ మెషిన్లు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పుడు దోబీలు ఏమయ్యారు? 1970, 1980 దశకాల్లో భారత్‌లో కంప్యూటరీకరణ వేగం పుంజుకున్నప్పుడు ఎంతమంది ఉద్యోగాలు పోలేదు! పోతాయనుకుంటే ఆ ఉద్యోగాలు మాత్రమే పోతాయి. వాటిస్థానంలో అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వస్తాయి.

ఇంటింటికి ఇస్త్రీ పెట్టలున్నా, వాషింగ్‌ మెషిన్లు వచ్చినా దోబీలకు ఏమాత్రం డిమాండ్‌ తగ్గకపోగా డిమాండ్‌ పెరిగిదంటే అతిశయోక్తి కాదు. కంప్యూటర్ల విప్లవంతో పోయినా ఉద్యోగాలకన్నా ఐటీలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంతో ఎక్కువన్నది అందరికీ తెల్సిందే. ఇప్పుడు పడిపోతున్న ఆ రంగం గురించి ఆలోచించడంలో అర్థం ఉంటుంది. పాత టెక్నాలజీ స్థానంలో వచ్చే కొత్త టెక్నాలజీ ఎప్పుడూ పురోగమనాన్ని కోరుకుంటుంది. ఈ పురోగమనంలో పాత ఉద్యోగాలు పోతుంటాయి. కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. అది సహజ సిద్దాంతం. దశాబ్దంలోగా డ్రైవర్‌ రహిత కార్లు వినియోగదారులకు చేరినా కొంతకాలంపాటు పర్యవేక్షకుడిలా వాటికీ డ్రైవర్‌ అసరమే. కాకపోతే డ్రైవర్‌ స్థానంలో సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన చాఫర్లు వచ్చి చేరవచ్చు.

ఇప్పటికే ఈ ప్రజా రవాణా రంగంలో ‘రైడ్‌ హేలింగ్‌ యాప్స్‌’ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఉబర్, ఓలా లాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటివల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడతారని ట్రేడ్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. కారు డ్రైవింగ్‌ వచ్చిన వారు ఆటోడ్రైవర్లలో ఎక్కువమంది క్యాబ్‌ డ్రైవర్లుగా మారిపోయారు. ఇంకా ఆటోలనే నడుపుతున్న డ్రైవర్లను ఓలా లాంటి కంపెనీలు తమ నెట్‌వర్క్‌లో చేర్చుకున్నాయి. కొత్తగా వచ్చే మార్పు వల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయో, ఆ మార్పు ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా ఎవరూ ముందుగా ఊహించలేరు. ఆ మార్పుతోపాటే మరెన్నో మార్పులు సంభవిస్తూ పాత ఉద్యోగాలు పోతూ కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. కొత్తను ఆహ్వానించినప్పుడే ముందుకుపోగలం.

మరిన్ని వార్తలు