ధన ప్రవాహానికి అడ్డుకట్ట!

5 Sep, 2013 04:47 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఎన్నికలలో నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) పది సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ప్రణాళిక అమలుకు సంబంధించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఈసీ ప్రతిపాదనల ప్రకారం... పార్టీ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పద్దులను, చిట్టాలను పార్టీ కోశాధికారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.

పార్టీకి అందే విరాళాలు లేదా నిధులను సహేతుకమైన సమయంలోగా గుర్తింపు పొందిన బ్యాంకులోని ఖాతాలో జమ చేయాలి. పార్టీ సభలు, ఎన్నికల ప్రచారం ఖర్చుల నిమిత్తం ఏకమొత్తంలో నిధులు ఇవ్వదలస్తే, ఆ మొత్తాన్ని చెక్ (ఖాతా ద్వారా చెల్లింపు), డ్రాఫ్ట్, ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ లేదా ఇంటర్‌నెట్ బదిలీ ద్వారా మాత్రమే చెల్లించాలి. నిర్దేశించిన మొత్తం కన్నా ఎక్కువగా అభ్యర్థి కానీ, కార్యకర్తలు కానీ తమ వెంట తీసుకెళ్లకుండా ఆయా రాజకీయ పార్టీలే చూసుకోవాలి.
 

మరిన్ని వార్తలు