పేరూరులో మంత్రి అనుచరుల భూదందా

5 Sep, 2013 04:54 IST|Sakshi

తిరుపతి రూరల్, న్యూస్‌లైన్: కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను మంత్రి అనుచరులు హరించేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలోని హరిపురంకాలనీ సమీపంలో ము రుగునీరు, వరదనీరు ప్రవహించేలా 40 అడుగుల వెడల్పుతో పెద్దకాలువ ఉంది. ఇది పోరంబోకు స్థలమే కదా అన్న ధీమాతో మంత్రి అనుచరులు కొందరు కన్నేశారు. కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని ఏకంగా కిలోమీటర్ మేర ఆక్రమించేశారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన గంగయ్య, చంద్రశేఖర్(బాబు) ఈ భూదందాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారిని చూసి చుట్టుపక్కల ఉన్నవారు కూడా కాలువ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు. నాలుగేళ్లలో ఈ పంచాయతీలో రూ.50 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు.
 
కాలువలు మాయం..
 పేరూరు పంచాయతీలో ప్రభుత్వ భూమి అధికంగా ఉంది. అదే స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నాయి. సప్తగిరుల నుంచి వ్యవసాయ కళాశాల మీదుగా వచ్చే 30 అడుగుల కా లువ, భారతంమిట్ట నుంచి వచ్చే లోతట్టు కాలువలు కిలోమీటర్ మేర 90 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. వ్యవసాయ కళాశాల నుంచి వచ్చే 40 అడుగుల కాలువ హ రిపురం కాలనీకి వచ్చే సరికి కేవలం 5 అడుగులు కూడా ఉం డడం లేదు. 530/1, 529, 543, 482, 541, 482సర్వే నెంబర్లలో భారీ ఆక్రమణలు జరిగాయి.

 అదను చూసుకుని..
 రెవెన్యూ సిబ్బంది సమైక్య ఉద్యమంలో ఉన్నారు. ఇదే అదనుగా భూ ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. నాయుడుపేట- బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని సర్వే నెంబర్ 80లో 1.7 ఎకరాల స్థలం(సుమారు నాలుగు కోట్లు విలువ) ఆక్రమణకు గురైంది. రెడ్డిగుంటలోని సర్వేనెంబర్ 482లో రూ. 2 కోట్లు విలువ చేసే భూమి ఆక్రమణకు గురైంది. 20 రోజుల్లో పేరూరు పంచాయతీలో రూ.6 కోట్లు విలువచేసే భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి అనుచరుల జోలికి వెళ్లడానికి  భయపడుతున్నారు.

 కాలువను సర్వే చేయిస్తా
  పది రోజుల క్రితం ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాం. మళ్లీ ఆక్రమించారనే సమాచారం లేదు. పూర్తి స్థా యిలో సర్వే చేయిస్తాం. ఆక్రమణలు జరిగి ఉంటే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు. నేను తహశీల్దార్‌గా వచ్చిన ఈ ఏడాదిలో పేరూరు కాలువ ఆక్రమణ జరగలేదు.
 -వెంకట్రమణ, తహశీల్దార్, తిరుపతి రూరల్
 

మరిన్ని వార్తలు