చైనాకు చావంటే కూడా భయమే

15 Jul, 2017 15:09 IST|Sakshi
చైనాకు చావంటే కూడా భయమే

న్యూయార్క్‌: కొందరు బతికి ఉండడమంటే చైనా ప్రభుత్వానికి భయమన్నది మానవ హక్కుల ఉద్యమాల గురించి తెలిసిన చాలా మందికి తెలుసు. కానీ వారి చావన్న కూడా చైనా ప్రభుత్వానికి భయమన్నది నేడు కొత్తగా తెలిసింది. నోబెల్‌ బహుమతి అవార్డు పొందిన రచయిత, చైనా మానవ హక్కుల కార్యకర్త లియు జియోబో (61) మరణ వార్త గురించి ప్రపంచానికి పెద్దగా తెలియకూడదని చైనా ప్రభుత్వం ఎంతో జాగ్రత్త పడింది. ఆయన మరణించారనే వార్త ఎలాగో ప్రపంచానికి తెలియడంతో ఆయన అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని చూసింది.

ఆయన మరణ వార్త పట్ల ప్రపంచం నలుమూలల నుంచి వెల్లువెత్తుతున్న సంతాప సందేశాలను, నివాళులను అడ్డుకునేందుకు కూడా శతవిధాల ప్రయత్నించింది. ఆయన కొటేషన్లనుకానీ, పోరాటానికి సంబంధించిన అంశాలనుగానీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంది. ఇంటర్నెట్‌ సర్చ్‌ ఇంజన్లను బ్లాక్‌ చేసింది. చైనాలో కూడా జియోబో మరణవార్త ఎక్కువగా ప్రచారం కాకుండా ఉండేందుకు జాగ్రత్త పడింది.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, కెనడా అధ్యక్షుడిని కలుసుకున్న విషయాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించిన చైనా పీపుల్స్‌ డెయిలీ పత్రికా జియోబో మరణ వార్తను చిన్నగానైనా ఎక్కడా పేర్కొనలేదు. గ్లోబల్‌ టైమ్స్‌లాంటి పత్రికలు జియోబో మరణ వార్త గురించి చిన్నగా రాసినప్పటికీ ఆయన పాశ్చాత్య దేశాల చేతుల్లో పావుగా బలయ్యారని పేర్కొంది. గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న జియోబో గురువారం నాడు శాన్‌యాంగ్‌ ఆస్పత్రిలో మరణించారు.

చైనాలో మానవ హక్కుల అవసరం గురించి, రాజకీయ సంస్కరణల ఆవశ్యకత గురించి రచనలు చేసినందుకు జియోబోను చైనా ప్రభుత్వం అరెస్ట్‌చేసి ఆయనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వభావాన్ని రెచ్చగొడుతున్నారన్న కేసు పెట్టింది. ఈ కేసులో 2009లో ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆయనకు క్యాన్సర్‌ వ్యాధి రావడంతో ఆయన గత నెలలో మెడికల్‌ పెరోల్‌పై శాన్‌యాంగ్‌ ఆస్పత్రిలో చేరారు. విదేశాల్లో చికిత్స చే యించుకుంటానని ఆయన మొరపెట్టుకున్నా అధికారులు అందుకు అనుమతించలేదు. ఆయన ఆరోగ్యం క్షీణించినందునే అనుమతించలేదని ఆస్పత్రి వర్గాలు ఆనక తెలిపాయి.

గురువారం మరణించిన జియోబోకు శనివారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఫొటోను, దుస్తులను భార్య లియు జియా (56) అప్పగించిన చైనా జైలు అధికారులు అస్థికలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జియోబోకు నోబెల్‌ బహుమతి వచ్చిన నాటి నుంచి ఆయన భార్య కవి, ఆర్టిస్ట్‌ లియు జియాను చైనా ప్రభుత్వం గహ నిర్బంధంలో ఉంచింది. చైనాలో మానవ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం జరుపుతున్నందుకు జియోబోకు 2010లో నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించారు. అప్పటికే ఏడాది నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. తమ పరువు తీసేందుకే ఆయనకు నోబెల్‌ బహుమతిని ప్రకటించారని చైనా ప్రభుత్వం నాడు అంతర్జాతీయ సమాజం ముందు గోల చేసింది.

ఇప్పుడు అంతర్జాతీయంగా జియోబోకు వస్తున్న నివాళులను చైనా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న విమర్శలకు ఇప్పుడు కూడా చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కులేదంటూ చైనా విదేశాంగ శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. జియోబో భార్యను గహ నిర్బంధం నుంచి విడుదల చేయాలనే డిమాండ్లకు మాత్రం చైనా స్పందించలేదు. ఆమె మిత్రులు చాలా మంది ఆమెను జర్మనీకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.

జియోబో మరణించినప్పుడు ఆయన భార్య లియు జియా ఆయన పక్కనే ఉందట. ‘హావ్‌ ఏ గుడ్‌ లైవ్‌’ అని ఆయన విష్‌చేసి కన్నుమూశారట. ఈ సందర్భంగా ఆమె తన భర్త గురించి రాసిన ‘ది విండ్‌’ కవిత నుంచి కొన్ని పంక్తులను విడుదల చేశారు. ‘నాలుగు గోడలు నిన్ను ఊపిరాడకుండా చేసినప్పుడు బలంగా గాలి వీస్తుంది. ఆ గాలి ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో మీకు తెలియదు’ అన్న ఆ కవితా పంక్తులు మాత్రం చైనా అడ్డు గోడలను దాటి చాలా మంది ఆయన అభిమానులకు ఎలాగో చేరాయి.

మరిన్ని వార్తలు