ఫేస్ బుక్ యూజర్లకు మరో కొత్త ఆప్షన్!

17 Aug, 2014 18:07 IST|Sakshi
ఫేస్ బుక్ యూజర్లకు మరో కొత్త ఆప్షన్!

న్యూయార్క్: నెటిజన్లకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది ఫేస్ బుక్. ఇప్పటివరకూ కంప్యూటర్ యూజర్లకు అందుబాటులోలేని ' సెటైర్' అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. ఇంతకుముందు మనం ఏమైనా కొన్ని ఆర్టికల్స్ ను పోస్ట్ చేస్తే అందులో కామెంట్లను అక్కడే చూసుకునే అవకాశం ఉంది. అయితే సెటైర్ అనే సరికొత్త ఆప్షన్ తో మనం ఫేస్ బుక్ లో కామెంట్లను ఆ బ్రౌజర్ నుంచి బయటకొచ్చేసినా చూసుకోవచ్చు. అందుకుగాను పోస్ట్ చేసే ఆర్టికల్స్ ను ఆనియన్ అనబడే లింక్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పోస్ట్ చేసిన వెంటనే సెటైర్ ట్యాగ్ ప్రత్యక్షమవుతుంది. మనకు వాటిపై వచ్చే కామెంట్లను అది ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. ఆ లింక్ నుంచి బయటకు వచ్చేసి మన పనిలో మనం ఉన్నా.. అవతలి వ్యక్తుల నుంచి వచ్చే సమాచారాన్ని డెస్క్ టాప్ పై ప్రత్యక్షం చేయడమే దీని ప్రత్యేకత.

 

మనం పోస్ట్ చేసిన ఆర్టికల్ హెడ్ లైన్ తో పాటు సెటైర్ బాక్స్ కన్పిస్తుంది. దీంతో మనం ఆ సెటైర్లు చూసుకోవడమే కాకుండా.. వాటికి తిరిగి కామెంట్లను హాస్యపంథాలో పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది.ఆనియన్ నుంచి వచ్చే వార్తలకు, వ్యంగాస్త్రాలకు ప్రత్యేక ట్యాగ్ ఉండాలని యూజర్లు నుంచి డిమాండ్లు ఎక్కువ కావడంతోనే దీన్ని ప్రవేశపెట్టినట్లు ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అంతకుముందు సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వీలు కుదిరినప్పుడు చూసుకునేందుకు వీలుగా వాటి లింకుల్ని దాచుకోవడానికి సేవ్ అనే ఆప్షన్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు