విద్యా రుణాలకు వెనుకంజ

10 Aug, 2013 01:10 IST|Sakshi
విద్యా రుణాలకు వెనుకంజ

న్యూఢిల్లీ: విద్యారుణాల మంజూరు విషయంలో చొరవ చూపాలంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్యాంకులు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోతుండటంతో రుణాలివ్వడాన్ని తగ్గించుకుంటున్నాయి. గతేడాది విద్యా రుణాలివ్వడంలో 14 శాతం వృద్ధి ఉండగా.. ఈసారికి ఇది 9 శాతానికి తగ్గిపోవడం దీనికి నిదర్శనం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. జూన్ 30 నాటికి బ్యాంకులు విడుదల చేసిన విద్యారుణాలు రూ. 55,500 కోట్ల మేర ఉన్నాయి. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ పెరుగుదల 9 శాతం మాత్రమే. అయితే, గ తేడాది జూన్ నాటికి విద్యారుణాలు వార్షిక ప్రాతిపదికన 14 శాతం మేర పెరగడం గమనార్హం. విద్యారుణాలు విడుదల చేయడంలో బ్యాంకుల వెనుకంజను ఇది తెలియజేస్తోంది. ఎడ్యుకేషనల్ లోన్లకు సంబంధించి రుణ హామీ ఫండ్‌ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇది ఇంతవరకూ సాకారం కాలేదని బ్యాంకర్లు అంటున్నారు.  ఇదిగానీ ఏర్పాటైతే.. దాదాపు రూ. 7.5 లక్షల దాకా తనఖా లేకుండా రుణాలు ఇవ్వడం సాధ్యపడుతుంది.
 
 విద్యా రుణాలకు డిమాండ్..
 బ్యాంకులు ప్రస్తుతం ఎక్కువగా మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు రుణాలిస్తున్నాయి. కోర్సును బట్టి వడ్డీ రేటు 11.5 శాతం నుంచి 13 శాతం దాకా ఉంటోంది.  మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్య, విదేశీ చదువులపై మరింతగా ఆసక్తి కనపరుస్తుండటంతో విద్యా రుణాలకు డిమాండ్ భారీగానే ఉంటోంది. గత పదేళ్ల వ్యవధిలో విద్యా రుణాలు గణనీయంగా పెరిగాయి. 2003లో బ్యాంకులు రూ. 2,870 కోట్ల మేర ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వగా.. ప్రస్తుతం ఇది అనేక రెట్లు పెరిగిపోయింది. అవాన్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అంచనాల ప్రకారం .. భారత్‌లో ఏటా దాదాపు రూ. 80,000 కోట్ల మేర విద్యారుణాలు అవసరం అవుతుండగా .. అందులో సుమారు రూ. 60,000 కోట్లు మాత్రమే విడుదలవుతున్నాయి. ఇందులో అత్యధికంగా 90-95 శాతం రుణాలను బ్యాంకులు ఇస్తుండగా .. మిగతా మొత్తాలను క్రెడిలా (హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో భాగం) వంటి చిన్నపాటి ఆర్థిక సంస్థలు సమకూరుస్తున్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే .. విద్యారుణాలు ఇచ్చే విషయంలో దక్షిణాది బ్యాంకులు ముందుంటున్నాయి.
 
 తగ్గుతున్న ఉద్యోగావకాశాలతో దెబ్బ..
 ఎడ్యుకేషన్ లోన్లకు సంబంధించి బ్యాంకులు వెనుక ంజ వేస్తుండటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు తీసుకున్న విద్యార్థులు కనిపించకుండా పోతున్నారని, వారిని వెతికి పట్టుకుని, ఇచ్చిన రుణాన్ని రాబట్టడం కష్టతరమవుతోందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. పెపైచ్చు.. దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు సైతం.. ఎగవేతలకు కారణమవుతున్నాయి. కొత్తగా డిగ్రీ పట్టా పుచ్చుకుని కాలేజి నుంచి బైటికి వచ్చేవారికి ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని బ్యాంకుల మొండి బకాయిల నిష్పత్తి ఏకంగా 7 శాతం దాకా ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు