గంగూలీని ఊరిస్తున్న మెగా చాన్స్!

17 Oct, 2016 18:09 IST|Sakshi
గంగూలీని ఊరిస్తున్న మెగా చాన్స్!

లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పు నేపథ్యంలో బీసీసీఐ ప్రస్తుత అధినాయకత్వానికి పదవీ గండం పొంచి ఉంది. లోధా కమిటీ సిఫారసుల విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఒకవేళ సుప్రీం తీర్పు కారణంగా ప్రస్తుత బోర్డు కార్యవర్గం దిగిపోవాల్సి రావొచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే భారత క్రికెట్ నియంత్రణ సంస్థ (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడి పగ్గాలు చేపట్టే అవకాశం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దక్కే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది.

భారత క్రికెట్ లో సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ సమర్థంగా అమలు చేయగలరనే వాదన క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇటు క్రికెట్ ఆడిన అనుభవమే కాకుండా.. అటు బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ) అధ్యక్షుడిగా పరిపాలన అనుభవం కూడా గంగూలీకి ఉండటం కలిసొచ్చే విషయం. భారత క్రికెట్ జట్టు సారథిగా గంగూలీ అద్భుతమైన సేవలు అందించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ స్కాం భారత క్రికెట్ ను కుదిపేస్తున్న సమయంలో పగ్గాలు చేపట్టిన గంగూలీ ఎలాంటి మచ్చలేని సారథిగా పేరు తెచ్చుకున్నాడు. 'దాదాను అప్రోచ్ అయ్యే దమ్మ ఎవరికీ లేదు' అని ఓ బూకీ ఆన్ రికార్డు చెప్పడం గంగూలీ నిజాయితీని చాటేదే.

అంతేకాకుండా తాను అనుకున్నది సాధించడానికి మంకుపట్టు పట్టడంలో దాదాను మించిన వారు లేరు. 2003 వరల్డ్ కప్ లో రాహుల్ ద్రవిడ్ తో కీపింగ్ చేయించడం.. ఇటీవల తన ప్రమేయంతో అనిల్ కుంబ్లేను టీమిండియాకు కోచ్ గా నియమించడం దాదా తీరు ఏమిటో స్పష్టం చేస్తాయి. అంతేకాకుండా బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా  తన నాయకత్వ పటిమను దాదా చాటాడు. టీ-20 వరల్డ్ కప్ లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సహా ఈడెన్ గార్డెన్ లో సవాలుతో కూడిన ఎన్నో మ్యాచ్లను సమర్థంగా నిర్వహించారు.

అయితే, ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (సీఏబీ)లోని ప్రత్యర్థులే కొందరు అడ్డుపడొచ్చునని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరి మాట వినకుండా దూకుడుగా వ్యవహరించే గంగూలీకి ఈ మధ్య  సీఏబీలో ప్రత్యర్థులు పెరిగారట. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీకి పగ్గాలు అందిస్తే.. బోర్డుకు ఉత్తమ సారథిగా సేవలందించే అవకాశముందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అక్రమాలకు తావులేకుండా దేశంలో క్రికెట్ వ్యవహారాలు చక్కదిద్దాలంటే దాదా నాయకత్వంలో అది సాధ్యమవుతుందని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు