గీత వ్యవహారంలో అనూహ్య మలుపు!

26 Oct, 2015 17:57 IST|Sakshi
గీత వ్యవహారంలో అనూహ్య మలుపు!

న్యూఢిల్లీ: దాదాపు 15 ఏండ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన గీత వ్యవహారంలో అనూహ్య మలుపు తిరిగింది. పాకిస్థాన్ నుంచి తిరిగొచ్చిన 23 ఏండ్ల ఆమె తన కుటుంబసభ్యులను గుర్తుపట్టలేదు. చెవిటి, మూగ అమ్మాయి అయిన గీత తమ కూతురని బిహార్‌కు చెందిన జనార్దన్ మహతో కుటుంబం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. జనార్దన్ మహతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా గీత తమ బిడ్డేనని పలువురు ముందుకొచ్చారు.

వీరి ఫొటోలను పాకిస్థాన్‌కు పంపించగా.. జనార్దన్ మహతో తన కుటుంబ సభ్యుడిగా గీత గుర్తించింది. అయితే ఢిల్లీలో మహతో కుటుంబాన్ని చూసి కూడా గీత వారిని గుర్తుపట్టలేదు. దీంతో గీత అసలు తల్లిదండ్రులు ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ఫలితాలు వచ్చేవరకు వేచిచూస్తామని, ఫలితాలు వచ్చిన తర్వాత నిజమైన కుటుంబసభ్యులను గుర్తించి గీతను అప్పగిస్తామని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం స్పష్టం చేశారు. గీత అసలైన తల్లిదండ్రులను వెతికేవరకు ఆమె ఇండోర్‌లో ఉండనున్నారు.

ఢిల్లీలో ఘనస్వాగతం
దాదాపు దశాబ్దంన్నరకు పాకిస్థాన్ నుంచి స్వదేశం చేరుకున్న గీతకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. తెలుపు-ఎరుపు రంగులో ఉన్న సల్వార్ కమీజ్ ధరించి.. సంతోషం నిండిన వదనంతో భారత్‌కు వచ్చిన ఆమెకు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 'మన బిడ్డ  గీతకు స్వాగతం' అంటూ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. అనంతరం గీత సుష్మాస్వరాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా  తన హృదయం ఎప్పుడూ భారత్‌లోనే ఉందని మంత్రితో గీత పేర్కొన్నారని అధికారులు తెలిపారు. ఇన్నాళ్లు పాకిస్థాన్‌లో గీత బాగోగులు చూసుకున్న ఈధీ ఫౌండేషన్ సభ్యులు గీతతోపాటు భారత్ వచ్చారు. కాగా, గీతకు ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఇవ్వనున్న విందును భూకంపం ఘటన కారణంగా రద్దుచేశారు. మరోవైపు పాక్ చూపిన ఈ సౌహార్దానికి ప్రతిగా భారత్ కూడా 459మంది తమ దేశపు ఖైదీలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్టు పాక్ రాయబార కార్యాలయం తెలిపింది.

నాకు పెళ్ల కాలేదు: గీత
తాను చిన్నప్పుడే పాకిస్థాన్‌కు వెళ్లిపోయానని, తనకు ఇంకా పెళ్లికాలేదని, పిల్లలు లేరని గీత స్పష్టం చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే గీతకు ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని మహతో కుటుంబ సభ్యులు చేస్తున్న వాదనను ఆమె తిరస్కరించారు.
 

మరిన్ని వార్తలు