బాధిత పురుషుల రక్షణలో... ఆ 'సెల్' | Sakshi
Sakshi News home page

బాధిత పురుషుల రక్షణలో... ఆ 'సెల్'

Published Mon, Oct 26 2015 4:12 PM

బాధిత పురుషుల రక్షణలో... ఆ 'సెల్'

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఇప్పుడు పురుషుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందడం గమనార్హం. చాలామంది పురుషులు వారి భార్యలు, కుటుంబ సభ్యులు డబ్బుకోసం, ఆస్తి కోసం  తమను తీవ్రంగా హింసిస్తున్నారని, లేదంటే విడాకులు కోరుతున్నారని ఆరోపిస్తున్నారు. కొందరైతే ఏకంగా తమను లైంగికంగా కూడా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు.  దీంతో కమిషన్... బాధిత పురుషులకు తగిన సహకారం అందించేందుకు ప్రయత్నిస్తోంది.

భారత రాజ్యాంగం ప్రకారం మహిళల హక్కులను పరిరక్షించడం కోసం 1994లో ఢిల్లీ కమిషన్ మహిళా చట్టాన్ని తీసుకు వచ్చింది. అలాగే పురుఫుల సమస్యలను చర్చించేందుకు కూడా  కమిషన్ నిర్ణయించింది. మొదట్లో కార్యాలయానికి పురుషులు వస్తే  తాము ఎంతో ఆశ్చర్యపోయామని, వారు తమ భార్యల వేధింపులను భరించలేకపోతున్నామంటూ ఫిర్యాదులు చేసేవారని, వాటిలో ఎక్కువగా మానసిక, శారీరక  హింస గురించి ఉండటంతో వాటిని స్వీకరించాల్సి వచ్చేదని.. డిసిడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివాల్ తెలిపారు.

కాగా అటువంటి కేసులు తమ దగ్గరకు వచ్చినపుడు సాధారణంగా బాధితుల భార్యలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంటామని, వారిపై ఎఫ్ఐఆర్‌లను నమోదు చేస్తామని కమిషన్ సీనియర్ అధికారి చెప్తున్నారు. ఈ కుటుంబ తగాదాలు ఎంతో సున్నితంగా ఉంటాయని, అటువంటప్పుడు భార్యాభర్తలతోపాటు వారి కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి  సమస్యను చర్చిస్తామని, సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తామని, లేదా మధ్యవర్తిత్వం కోసం ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్దకు పంపిస్తామని అంటున్నారు.  

అయితే విషయం తీవ్రంగా అనిపించినప్పుడు  లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేందుకు రిఫర్ చేస్తామని ఆయన చెప్తున్నారు. అటువంటి పలు సందర్భాల్లో మహిళలకు వారి కుటుంబం నుంచీ మద్దతు ఉన్నట్లుగా బాధిత పురుషులకు ఉండటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పురుషులకు ఢిల్లీ లీగల్  సర్వీస్ అథారిటీ సహాయపడుతోందని వారు చెప్తున్నారు.

Advertisement
Advertisement