వీధి కుక్కల దాడిలో బాలిక మృతి

26 Apr, 2015 05:55 IST|Sakshi

వల్సాద్ (గుజరాత్): వీధి కుక్కల దాడిలో మరో బాలిక మృతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో ఈ ఘోర ఘటన జరిగింది. శుక్రవారం వల్సాద్ జిల్లా కరాదివా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కెన్నీ పటేల్ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై ఎనిమిది నుంచి తొమ్మిది కుక్కలు దాడి చేశాయి. ఈ దాడితో భయకంపితురాలైన ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తర్వాత గ్రామస్థులు ఆమెను కుక్కల దాడి నుంచి కాపాడి తొలుత స్థానిక పీహెచ్‌సీ, అక్కడి నుంచి దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికితరలించారు.

అయితే ఆ రెండు చోట్ల యాంటీ రాబిస్ ఇంజక్షన్ లేకపోవడంతో ఆమెను వల్సాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలిక ఒంటిపై 20పైగా తీవ్రంగా కాట్లు ఉన్నాయని, ఆమెను తీసుకురావడంలో ఆలస్యం జరగడంతో కాపాడలేకపోయామని డాక్టర్లు పేర్కొన్నారు. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న బాలిక తల్లి మరుగుదొడ్డి కట్టుకోవడానికి రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉండటం శోచనీయమని స్థానికులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు