136 జీవోను సవరించాల్సిందే

3 Oct, 2015 04:56 IST|Sakshi
136 జీవోను సవరించాల్సిందే

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

 సాక్షి, హైదరాబాద్: కరుణానిధి ప్రభుత్వం 2006లో తీసుకువచ్చిన 136 జీవో తెలుగువారికి గొడ్డలిపెట్టులాంటిదని.. తక్షణమే ఆ జీవోను సవరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తమిళనాడులో తెలుగు భాష రద్దుకు నిరసనగా తమిళనాడు యువశక్తి ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమం ప్రారంభించారు. తమిళనాడులో నిర్బంధ తమిళం పూర్తి అన్యాయమన్నారు. 136 జీవో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. తమిళులు, కోట్ల మంది తెలుగువారు మమేకమై జీవిస్తున్న సందర్భంలో ఇలాంటి జీవోల అమలుకు జయలలిత సర్కారు పూనుకోవటం సరికాదన్నారు.

తెలుగును రెండో అధికార భాషగా చేయాలని అన్నారు. వెబ్‌సైట్ సంతకాల ఉద్యమంలో తెలుగుజాతి యావత్తు పాల్గొనాలని కోరారు. తక్షణమే రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు స్పందించాలని సూచించారు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ 136లోనే అవసరమైతే సవరించవచ్చు అన్న వాక్యం రాసుందని తెలిపారు. తమిళనాట త్రిభాషా సూత్రం తీసుకురావాలని చెప్పారు. ఇది 90 వేలమందికి సంబంధించిన విషయమని.. ఆస్తిపోతే సంపాదించుకొంటాం.. కానీ అక్షరం పోతే సంపాదించుకోలేమని వాపోయారు. తెలుగును ద్వితీయ భాషగా గుర్తించాలన్నారు.

ఈ విషయంలో కరుణానిధి, సీఎం జయలలిత స్పందించాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ నిర్బంధ తమిళ చట్టాన్ని తీసుకురావడం తగదన్నారు. ఈ విషయాన్ని తమిళ సర్కారు సరిదిద్దుకోవాలన్నారు. ఈ విషయంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి, జయలలిత సర్కారుతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ సంతకాల ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వపు ఉపాధ్యక్షురాలు ఆవుల మంజులత మాట్లాడుతూ తమిళాన్ని ఒక భాషగా ఇక్కడ ఆహ్వానిస్తున్నప్పుడు అక్కడ తెలుగు భాషను ఎందుకు ఆహ్వానించరని ప్రశ్నించారు.

సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ తెలుగును ప్రపంచ వ్యాప్తంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగును రెండో అధికార భాషగా చేయాలన్నారు. తమిళనాట భాషా స్వాతంత్య్రం కావాలన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు