వారు కోరినట్టుగా నడుచుకోండి! | Sakshi
Sakshi News home page

వారు కోరినట్టుగా నడుచుకోండి!

Published Sat, Oct 3 2015 4:56 AM

వారు కోరినట్టుగా నడుచుకోండి! - Sakshi

♦ అధికారులకు సీఎం ఆదేశాలు
♦ పనులు చేపట్టని కాంట్రాక్టర్లను వెనకేసుకొస్తున్న వైనం
♦ విపక్షంలో ఉన్నప్పుడు దీనిపై గగ్గోలు పెట్టిన బాబు
 
 సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులూ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందంటూ గగ్గోలు పెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే వారి విషయంలో మాట మార్చారు.  పనులు చేయని కాంట్రాక్టర్లను తొలగించాలని కోరుతున్న ప్రభుత్వాధికారులపైనే ఇప్పుడు బాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల తీరును తప్పుపడుతున్న అధికారులపై ఎదురుదాడి చేస్తూ ‘మీకే వారితో పనులు చేయించుకోవడం రావడం లేదు..’ అంటున్నారాయన. దీంతో ఖంగుతినడం అధికార యంత్రాంగం వంతు అవుతోంది.  ఇటీవల జిల్లా కలెక్టర్ల సమావేశం సందర్భంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపట్టిన రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చసాగింది.

ఈ చర్చ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేయని కాంట్రాక్టర్ల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా కాకినాడ-రాజమండ్రి కెనాల్ రహదారి విస్తరణ పనులు చేయడంలో కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ విఫలం చెందిందని, దీనిపై ప్రపంచబ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సంస్థను తొలగించేందుకు సంబంధించిన ఫైలును రెండు నెలల క్రితమే సీఎం కార్యాలయానికి పంపించామని అధికారులు పేర్కొన్నారు.

దీనిపై బాబు స్పందిస్తూ కాంట్రాక్టర్లను శత్రువులుగా చూడవద్దని, వారికి అడిగినంత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లతో పనులు చేయించుకునేలాగా వ్యవహరించాలంటూ అధికారులకే సీఎం క్లాప్ పీకారు. మొబిలైజేషన్స్ అడ్వాన్సు ఇచ్చినప్పటికీ పనులు చేయడం లేదని, సంవత్సరాలు గడిచినా రెండు శాతం కన్నా పనులు కూడా పూర్తి కాలేదని అధికారులు చెప్పినా... బాబు మాత్రం కాంట్రాక్టర్లనే వెనకేసుకువచ్చేలా మాట్లాడటం పట్ల అధికారులు విస్మయం చెందారు.

 ఆ పనులు ఇప్పటికీ కాలేదు
 ప్రపంచబ్యాంకు ఆర్థిక సాయంతో 310 కోట్ల రూపాయల వ్యయంతో 62 కిలో మీటర్ల మేర కాకినాడ-రాజమండ్రి కెనాల్ రహదారి విస్తరణ పనులను పీపీపీ విధానంలో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు మూడేళ్ల క్రితం అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ రెండు శాతం పనులను కూడా పూర్తి చేయకపోవడంతో అటు ఆర్థిక సాయం అందించిన ప్రపంచ బ్యాంకు ఇటీవల సమీక్షలో తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. దీంతో ట్రాన్స్‌ట్రాయ్‌ను పనుల నుంచి తొలగించాల్సిందిగా రోడ్లుభవనాల శాఖ సీఎంను కోరినా ప్రయోజనం లేకపోయింది.

Advertisement
Advertisement