అంతటా అవినీతే..

25 Aug, 2016 04:06 IST|Sakshi

అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ దానిదే ప్రధాన పాత్ర
లోకాయుక్త జస్టిస్‌ బి సుభాషణ్‌రెడ్డి ఆవేదన
హైదరాబాద్‌:
దేశంలో అవినీతి లేని ప్రభుత్వ విభాగం అంటూ ఏదీ లేదని, అన్నింట్లోనూ లంచమే ప్రధాన పాత్ర పోషిస్తోందని లోకాయుక్త సుభాషణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో ది ఇంటర్నేషనల్‌ స్టెమ్‌ సొసైటీ ఫర్‌ హ్యుమన్‌ రైట్‌ సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌ఈఆర్‌ ఇండియా కాన్ఫరెన్స్‌– 2016 పేరిట నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సామాన్యశాస్త్రంలో వస్తున్న మార్పులు.. అభివృద్ధిని ఆహ్వానిస్తున్నప్పటికీ దీన్ని సరైన రీతిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని 40% మంది మాత్రమే మంచి కోసంవినియోగిస్తున్నారన్నారు. మన దేశంలో మేధోసంపత్తి అపారమని.. అయితే విదేశాలకు వలస వెళ్లకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బాలకల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని.. ఇప్పటికీ లక్షల సంఖ్యలో అమ్మాయిలను గర్భంలోనే చంపేస్తున్నారన్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రపంచంలో 2030 తర్వాత భారత్, చైనా దేశాలే సూపర్‌ పవర్స్‌గా మారుతాయని రాష్ట్ర అదనపు డీజీపీ టి. కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ దేశాల్లో 50 శాతం జనాభా ఆర్థికంగా స్థిరపడే స్థాయికి చేరుకుంటారన్నారు. అనంతరం ఏసీపీ స్వాతి లక్రా మహిళలు, అమ్మాయిల రక్షణ కోసం చేపట్టిన చర్యలను వివరించారు. సాయంత్రం నిర్భయ తల్లిదండ్రులు ఆశాదేవి, భద్రీనాథ్‌సింగ్‌ తాము ఏర్పాటు చేసిన ట్రస్ట్, యాప్‌ గురించి వివరించారు.

మరిన్ని వార్తలు