చమురు కంపెనీలకు రూ. 17 వేల కోట్ల సబ్సిడీ

8 Nov, 2013 01:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) తదితర ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం రూ. 17,772 కోట్ల నగదు సబ్సిడీని గురువారం మంజూరు చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఉత్పత్తులను మార్కెట్ రేటు కన్నా తక్కువగా విక్రయించినందు వల్ల ఎదురైన ఆదాయ నష్టాలను భర్తీ చేసుకునేందుకు చమురు కంపెనీలకు ఇది ఉపయోగపడనుంది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విక్రయించడం వల్ల మూడు ప్రభుత్వ రంగ సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), ఐవోసీ సుమారు రూ. 35,328 కోట్ల ఆదాయాలను నష్టపోవాల్సి వచ్చింది. ఇందులో సుమారు రూ. 16,730 కోట్లను చమురు ఉత్పత్తి సంస్థలు ఓఎన్‌జీసీ, గెయిల్ సమకూరుస్తుండగా.. మిగతాది కేంద్రం నగదు సబ్సిడీ కింద అందిస్తోంది. రూ. 8,772 కోట్ల సబ్సిడీని బుధవారమే ఆమోదించిన ఆర్థిక శాఖ, గురువారం మరో రూ. 9,000 కోట్లను ఆమోదించిందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు