ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?

20 Jan, 2017 10:23 IST|Sakshi
ఈ వీడియో చూశాక కూడా వద్దంటారా?
జల్లికట్టు ఆటలో ఎద్దులను హింసిస్తారని, వాటి తోకలు కొరికి.. కర్రలతో బాది వాటిని పరుగులు తీయిస్తారని పెటా లాంటి జంతుహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మూగ జీవాలను హింసించే ఇలాంటి ఆటలను నిషేధించాలని కోర్టుకెక్కాయి. కానీ, తమిళుల వాదన మరోలా ఉంది. తాము ఆవులు, ఎద్దులను ఎంతగానో ప్రేమిస్తామని, కన్న బిడ్డల్లా చూసుకుంటామని.. అలాంటి వాటిని తాము ఎందుకు హింసిస్తామని అడుగుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమిళ నటుడు విక్రమ్ ప్రభు తన ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశారు. 
 
ఒక చిన్న పిల్లాడు ఎద్దుతో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు. అందకపోయినా కాళ్లెత్తి మరీ దాని కొమ్ములు పట్టుకుని కిందకు వంచి, గంగడోలుతో ఆడుకుని, చెవులు నిమురుతూ.. ఎంతలా దాన్ని అటూ ఇటూ తిప్పినా కొమ్ములు తిరిగిన ఆ ఎద్దు ఏమీ చేయకుండా ఊరుకుంటుంది. పిల్లాడితో ఆడుకున్నట్లుగానే కనిపిస్తుంది. తమిళనాడులో పశువుల పెంపకం ఒక మంచి సంస్కృతి అని, ఆవులు.. ఎద్దులతో తాము ఇలాగే స్నేహపూర్వకంగా ఉంటామని, అందువల్ల జల్లికట్టును సంస్కృతిలో భాగంగానే చూడాలని అంటున్నారు. 
 
స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్లలా కాకుండా, ఇక్కడ బహిరంగ స్థలంలో ఎడ్లను స్వేచ్ఛగా పరుగులు తీయనిస్తామని చెబుతున్నారు. ఈ వీడియో చూస్తే మాత్రం పశువుల పట్ల తాము ఎలా ఉంటామో, అవి తమతో ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తుందని చెబుతున్నారు. చిన్నతనంలో తాను తమ ఇంట్లో ఉండే పశువులన్నింటినీ పేర్లుపెట్టి పిలవడం తనకు ఇంకా గుర్తుందని కూడా విక్రమ్ ప్రభు ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.