క్షమాపణ చెప్పిన క్లింటన్

9 Sep, 2015 10:20 IST|Sakshi
క్షమాపణ చెప్పిన క్లింటన్

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ క్షమాపణ చెప్పారు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు న్యూయార్క్ లోని తన నివాసంలో ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వినియోగించినందుకు ఆమె క్షమాపణ కోరారు. 'తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. దీనికి క్షమాపణ చెబుతున్నా. దీనికి పూర్తి బాధ్యత నాదే' అని ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

వివాదస్పద ఈమెయిల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంపై క్షమాపణ చెప్పేందుకు అంతకుముందు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూల్లోనూ ఆమె నిరాకరించారు. ప్రభుత్వం అనుమతి మేరకే  ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ పెట్టుకున్నట్టు తెలిపారు. మార్చిలో ఈ విషయం వెలుగు చూడడంతో అన్నివర్గాల నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగింది. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చినా చివరకు క్షమాపణ చెప్పారు.

ఈ సర్వర్ ద్వారా ఏదైనా కీలక సమాచారం దుర్వినియోగం అయిందా అనే దానిపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే క్లాసిఫైడ్ సమాచారం కోసం తన ప్రైవేట్ సర్వర్ వాడలేదని అంతకుముందు హిల్లరీ క్లింటన్ తెలిపారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమొక్రటిక్ పార్టీ తరపు అభ్యర్థిగా నిలిచేందుకు హిల్లరీ ముందజలో ఉన్నారు.

మరిన్ని వార్తలు