ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

22 Aug, 2015 02:03 IST|Sakshi
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి

* రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్
* హైకోర్టును ఆశ్రయించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  

సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదట పూర్తి చేసి, ఆ తరువాతనే తాజాగా ప్రకటించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత 4.67 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయని పద్మనాభరెడ్డి తన పిటిషన్‌లో వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారిస్తూ 1150 మంది అక్రమాలకు పాల్పడ్డారని, అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలిపారన్నారు.

ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనులను కొనసాగించేందుకు బడ్జెట్‌లో ఎటువంటి నిధులు కేటాయించలేదని పద్మనాభరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద ఇప్పటికే రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, నిర్మాణం ఆగిపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు