క్యూనెట్ కుంభకోణం కేసులో మాజీ క్రీడాకారుడి అరెస్ట్

19 Oct, 2016 14:48 IST|Sakshi
క్యూనెట్ కుంభకోణం కేసులో మాజీ క్రీడాకారుడి అరెస్ట్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ కుంభకోణం కేసులో ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ క్రీడాకారుడు, పద్మ భూషణ్ అవార్డీ మైఖెల్ ఫరేరాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కామర్స్ సంస్థగా చెప్పుకునే క్యూనెట్.. ఇంటర్నెట్ లో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట దాదాపు 5 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసింది. క్యూనెట్ చేతిలో మోసపోయిన ఓ హైదరాబాద్ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 
 
సుదీర్ఘ దర్యాప్తులో అనేక ఆధారాలను సేకరించిన హైదరాబాద్ పోలీసులు సంస్థ డైరెక్టర్ అయిన మైఖెల్ తోపాటు మరో ముగ్గురిని మంగళవారం రాత్రి ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. ముంబై కోర్టు అనుమతితో బుధవారం ఉదయం వారిని హైదరాబాద్ కు తరలించి విచారిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన సత్తాచాటిన మైఖెల్ ఫరేరా బిలియడ్స్ లో నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్. క్రీడారంగానికి అతని సేవలను గుర్తిస్తూ 1983లో కేంద్ర ప్రభుత్వం మూడో అత్యున్నత పౌరపురస్కారం 'పద్మ భూషణ్' ప్రకటించింది. క్యూనెట్ సంస్థ పిరమిడ్ తరహాలో నిర్వహించిన ఆన్ లైన్ మల్టీలెవల్ మార్కెటింగ్ లో తెలంగాణ, ఏపీలే కాక దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాదిమంది డబ్బు చెల్లించి మోసపోయారు.
మరిన్ని వార్తలు