'నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజు'

10 Jun, 2015 11:44 IST|Sakshi
'నన్ను అరెస్టుచేస్తే.. కేసీఆర్ సర్కారుకు అదే ఆఖరిరోజు'

జాతీయ మీడియాతో చంద్రబాబు వ్యాఖ్య
గవర్నర్ పాత్రపైనా విమర్శలు


న్యూఢిల్లీ
తనను అరెస్టు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే.. అదే ఆయన ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో బద్నాం అయిన చంద్రబాబు.. కేసీఆర్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కేంద్రంలోని పెద్దలందరినీ కలుస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ ప్రైవేటు హాటల్లో బస చేశారు. ఫోను సంభాషణలు, ఇతర రికార్డులు అన్నింటినీ మార్చేశారని ఆయన ఆరోపించారు.

తనను, తన పార్టీ నాయకులను భయపెట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంలో కేసీఆర్ పాత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. తన సంభాషణలను ఆయన రికార్డుచేసినా, ఆయన ఛానల్ చేసినా.. దానికి తానెందుకు సమాధానం చెప్పాలని బాబు అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనపై బురద జల్లుడు కార్యక్రమానికి పాల్పడుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం తానెంత ప్రయత్నించినా ఆయన ముందుకు రాలేదని చంద్రబాబు ఆరోపించారు. తనకు తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఉండటం.. ఉండకపోవడంలో పెద్ద ఆసక్తి ఏమీ లేదని, కానీ కేసీఆర్ మాత్రం తన పార్టీని చీల్చి బలాన్ని పెంచుకుంటున్నారని అన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్ ఎలా అనుమతి ఇస్తారంటూ గవర్నర్ నరసింహన్ పాత్రపై కూడా ఆయన మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు