టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

11 Oct, 2015 09:16 IST|Sakshi
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చాపకింద నీరులా ఉన్న వర్గ విభేదాలు శనివారం భగ్గుమన్నాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ బాబు అధ్యక్షతన స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం పార్టీ సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు దాసరి రామక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పట్టణ కమిటీ సభ్యులను ప్రకటిస్తుండగా ఎంపీపీ మైక్ తీసుకుని తమను సంప్రదించకుండా కమిటీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. పాతవారిని పక్కనపెట్టి కొత్తవారికి పదవులు ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఒక దశలో కమిటీ జాబితాను ఎంపీపీ లాక్కోగా, కార్యకర్తలు రెచ్చిపోయి ఎంపీపీని నెట్టివేశారు.
 
 ఆమె మొహంపై స్వల్ప గాయాలయ్యాయి. కన్నీటి పర్యంతమైన ఎంపీపీ అక్కడి నుంచే మంత్రి పీతల సుజాతకు ఫోన్ చేసి తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మంత్రి పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాలుగా విడిపోయారు. పార్టీ కార్యకలాపాలను ఎవరికి వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.
 
 పోలీసులకు ఫిర్యాదు
 ఈ ఘటనపై ఎంపీపీ రామక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడు తూ ‘నేను చావాలా? బతకాలా.. ప్రతి పనిలో నాకు అడ్డుతగులుతున్నారు. తక్కువ కులం దాని వంటూ చిన్నచూపు చూస్తున్నారు. నానా బాధ లు పెడుతున్నారు. నేను పరువుగా బతుకుతున్నాను. ఇప్పుడు నాపై దౌర్జన్యం కూడా చేశారు. నన్ను వేదికనుంచి లాగి పక్కకు నెట్టేశారు. ఇంత అవమానం జరిగాక కార్యకర్తల ఎదుటే ఉరి వేసుకుని చచ్చిపోతాను’ అని వాపోయారు.

మరిన్ని వార్తలు