కుంబ్లేతో పెట్టుకొని.. భారీ మూల్యమే చెల్లించాడు!

19 Jun, 2017 17:39 IST|Sakshi
కుంబ్లేతో పెట్టుకొని.. భారీ మూల్యమే చెల్లించాడు!

ప్రతిష్టాత్మకమైన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తున్నది. ఆటలో గెలుపోటముల సహజమే అయినా.. ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఎవరు? దీనికి బాధ్యులు ఎవరు? అంటూ అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి.

డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా, హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి.. చాంపియన్స్‌ ట్రోఫీని ఘనంగా ఆరంభించింది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఎదురుదెబ్బ తీన్నా.. దక్షిణాఫ్రికాను ఓడించి.. సెమీ-ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కానీ లీగ్‌ దశలో చిత్తుగా ఓడించిన జట్టు చేతిలోనే భారత్‌ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కారణం ఎవరు? శ్రీలంక చేతిలో ఓడిపోయిన తర్వాతైనా టీమిండియా పూర్తిగా కళ్లు తెరిచిందా? అంటే లేదనే ఫైనల్‌లో కోహ్లి సేన ఆటతీరు చాటుతోంది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి- ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లేకు ఉన్న విభేదాలు అందరికీ తెలిసిందే. కుంబ్లే కఠినంగా వ్యవహరిస్తున్నాడని, ప్రాక్టీస్‌ విషయంలో హెడ్‌ మాస్టర్‌ తరహాలో జట్టు సభ్యులతో ప్రవర్తిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని కోహ్లి అభియోగం. నిజానికి ఇలా అభియోగాలు చేయడం మూర్ఖత్వం. కోచ్‌ అనేవాడు కఠినంగా ఉండాలి. అంతేకానీ జట్టు సభ్యులతో బాతాఖానీ కొడుతూ.. వాళ్లు ఏది చేస్తే అదే సరైందంటూ కోచ్‌ భజన చేయకూడదు. భారత క్రికెట్‌ దిగ్గజమైన అనిల్‌ కుంబ్లేది మొదటినుంచి కఠినమైన స్వభావమే. నాడు జట్టులో ఉన్నప్పుడు ఎంత కష్టపడేవాడో నేడు కోచ్‌గా ఉన్నప్పుడూ అదేవిధంగా పనిచేస్తున్నాడని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

కానీ, కోచ్‌ కుంబ్లేతో విభేదాలు పెట్టుకున్న కోహ్లి.. పైకి ఆ విషయం లేదంటూనే ప్రతీకార ధోరణి కనబర్చినట్టు కనిపిస్తోంది. అసలు కీలకమైన ఫైనల్‌ మ్యాచ్‌ కోసం జట్టు కూర్పును కోచ్‌-కెప్టెన్‌ కలిసి చర్చించి ఖరారు చేశారా? అసలు ఫైనల్‌ మ్యాచ్‌ కోసం సరైన వ్యూహాన్ని ఇద్దరు కలిసి సిద్ధం చేశారా? అన్నది ఇప్పుడు సందేహాలు రేకెత్తిస్తోంది. తుది జట్టు కూర్పు మొత్తం కోహ్లి ఇష్టానుసారంగా ఉన్నట్టు కనిపిస్తోంది. దేశీయ పిచ్‌లపై చెలరేగే అశ్విన్‌ ఇంగ్లండ్‌లో తేలిపోయాడు.

అయినా అతనికి ఫైనల్‌లో చాన్స్‌ ఇచ్చారు. ఎప్పుడోసారి ఆడే రవీంద్ర జడ్జేజాను కూడా జట్టులోకి తీసుకున్నారు. తన వికెట్‌ కోసం బాగా ఆడుతున్న హార్థిక్‌ పాండ్యాను రన్నౌట్‌ చేయించి.. తాను జట్టు కోసం ఏపాటి త్యాగం చేస్తాడో అతను చాటుకున్నాడు. ఇక బుమ్రా చేసిన తప్పులు మళ్లీ చేయడం మినహా.. కొత్తగా నేర్చుకున్నదీ.. తప్పులు సరిదిద్దుకున్నదీ లేదు. ఇక యువీ, ధోనీ కూడా జట్టులో అలంకారప్రాయంగానే ఉన్నారన్నది నిపుణుల అభిప్రాయం. మొత్తానికి కోచ్‌కు, కెప్టెన్‌కు సఖ్యత లేకపోవడం వల్ల జట్టు కూర్పు నుంచి వ్యూహాల వరకు అన్ని ఇష్టానుసారం సాగి.. బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది.
 

>
మరిన్ని వార్తలు