భారత్‌లో దాడులకు ఐఎస్‌ఐ కుట్ర

29 Sep, 2015 03:21 IST|Sakshi

♦ లష్కరే, జైషే, హిజ్బుల్‌లతో పాటు సిక్కు ఉగ్రవాదులకూ శిక్షణ
♦ 15 నుంచి 20 మంది వరకూ ఉగ్రవాదుల సమీకరణ
 
 న్యూఢిల్లీ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ భారత్‌లో ఉగ్రదాడులు జరపటానికి.. లష్కరే తోయిబా, జైషేమొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో పాటు.. సిక్కు తీవ్రవాద సంస్థలైన బబ్బర్‌ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదులను సమీకరించి శిక్షణనిప్పిస్తోందని నిఘా సమాచారం తెలిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో దాడులు జరపటానికి.. 15 నుంచి 20 మంది ఉగ్రవాదులను ఐఎస్‌ఐ సమీకరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే పాక్, ఆక్రమిత కశ్మీర్ వాసులను ఎంపిక చేసింది.

పాక్ నుంచి ఎంపిక చేసిన సిక్కు ఉగ్రవాదులకు.. సిక్కు సంప్రదాయాలు, గుర్ముఖీ గ్రంథం గురించి పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాలో తర్ఫీదునిచ్చింది. ఇందుకోసం ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్‌సింగ్  సాయం తీసుకుంది. పంజాబ్ భౌగోళిక స్వరూపస్వభావాలను వివరించింది. ఈ ఉగ్రవాదులందరికీ భారత సరిహద్దు వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఇతర శిబిరాల్లో.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వినియోగించటంపై శిక్షణనిస్తోంది. శిక్షణ కార్యక్రమం లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సాయంతో సాగుతోంది.

ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఇప్పటికే దాడుల కోసం పంజాబ్‌కు వచ్చి ఉండొచ్చని, లేదా ప్రవేశించే క్రమంలో ఉండి ఉంటారని.. పంజాబ్, కశ్మీర్‌లలోని భద్రతా సంస్థలను భారత నిఘా విభాగం హెచ్చరించింది. ఈ దాడుల కోసం వాడే ఆయుధాలను జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్‌కు వచ్చే ట్రక్కుల చాసిస్‌లలో తొలిచిన పగుళ్లలో దాచిపెట్టి పంపించే అవకాశముందని పేర్కొంది. ఈ సమాచారాన్ని జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు.. అక్కడ ఉన్న సైన్యం, కేంద్ర బలగాలకు ఈ నెల 24వ తేదీన తెలియజేసింది. పంజాబ్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న బీఎస్‌ఎఫ్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్, సీఆర్‌పీఎఫ్ యూనిట్లకు ఈ నెల 26వ తేదీన తెలిపింది.

మరిన్ని వార్తలు