జవాన్ల నాసిరకం తిండిపై స్పందించండి

18 Jan, 2017 18:53 IST|Sakshi

కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: దేశ సరిహద్దులోని సైనికులకు నాసిరకం ఆహారం వడ్డించడంపై స్పందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ జి.రోహిణి, న్యాయమూర్తి జస్టిస్‌ సంగీతా ధింగ్రా సెహగల్‌లతో కూడి ధర్మాసనం విచారించింది. సైనికులకు నాసిరకం వడ్డిస్తున్నట్లుగా బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) జవాన్‌ తేజ్‌బహదూర్‌ యాదవ్‌ ఈ నెల 9న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ అంశంపై తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా బీఎస్‌ఎఫ్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసు(ఐటీబీపీ), సశాస్త్రసీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, పరిశోధన నివేదకను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అధికారుల్లో అవినీతి పేరుకుపోయిందని, అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయని వీడియో అప్‌లోడ్‌ చేసిన యాదవ్‌పై చర్యలు తీసుకునే అంశంలో తాము జోక్యం చేసుకోబోమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు ఈ అంశంపై, అభిషేక్‌ కుమార్‌ ఛౌదరి అనే న్యాయవాది కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నాసిరకం ఆహారం అంశం సైనికుల మనోధైర్యాన్ని ప్రభావితం చేయకుండా చూడాలని, సైనికులకు అందిస్తున్న ఆహారం, ఆహారం తయారీ, వివిధ స్థాయిల్లోని అధికారులకు అందిస్తున్న ఆహారంపై స్పష్టతనివ్వాలని పిల్‌లో కోరారు. 

మరిన్ని వార్తలు