మరణించిన 47 ఏళ్ల తర్వాత నీటిబిల్లు!!

30 Jun, 2014 12:38 IST|Sakshi

పాకిస్థానీ అధికారులు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. మరణించిన 47 సంవత్సరాల తర్వాత.. రూ. 2.63 లక్షల నీటి బిల్లు పంపారు. అదికూడా వాళ్లకు, వీళ్లకు కాదు.. పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాకు పంపారు!! నోటీసు అందిన పది రోజుల్లోగా బిల్లు చెల్లించాలని, లేనిపక్షంలో తాగునీటి, మురుగునీటి కనెక్షన్లు తొలగిస్తామని కరాచీ వాటర్ అండ్ సివరేజి బోర్డు ఆమెకు బిల్లు పంపింది. భూమి రెవెన్యూ చట్టం ప్రకారం ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చని, వేలం వేయచ్చని, జరిమానా కూడా విధించవచ్చని అధికారులు అంటున్నారు. అంతే కాదు.. ఆమెను అరెస్టు కూడా చేయొచ్చట!!

ఆ నోటీసు ప్రకారం అయితే.. మే 28లోగా మొత్తం బిల్లు చెల్లించాలి. బిల్లు అందలేదని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం ఆమె ఇంటిని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. అక్కడ జిన్నా, ఆయన సోదరి ఉపయోగించిన వస్తువులను కూడా భద్రంగా ఉంచారు. ఈ ఇంటిని జిన్నా 1944లో 1.15 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. 1948 సెప్టెంబర్లో ఫాతిమా ఆ ఇంట్లోకి వెళ్లి, 1964 వరకు ఉన్నారు. 1965లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీచేశారు. 1967లో ఆమె మరణించారు.  విషయం తెలుసుకున్న తర్వాత కరాచీ మునిసిపల్ కమిషనర్ సదరు వాటర్ బోర్డు అధికారిని పిలిచి, చీవాట్లు పెట్టి నోటసు వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

మరిన్ని వార్తలు