శ్రీవారి సేవలో సీఎం

29 Nov, 2013 03:23 IST|Sakshi
శ్రీవారి సేవలో సీఎం

సాక్షి, తిరుమల : ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. మహద్వారం వద్ద టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అర్చకులతో కలసి సీఎంకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని బంగారువాకిలి ద్వారా కులశేఖరపడి వద్దకు చేరుకున్నారు. పచ్చకర్పూరపు వెలుగులో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్నారు. స్వామి పాదాల వద్ద ఉంచిన పట్టు శేషవస్త్రాన్ని సీఎంకు బహూకరించారు. తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. స్వామి దర్శనం తర్వాత సీఎం ఆలయం వెలుపలకు రాగానే కొందరు భక్తులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. శ్రీవారి దర్శనం ముగించుకుని మధ్యాహ్న భోజనం తర్వాత 1.30 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.
 
 గొల్ల మంటపంపై సీఎం ఆరా
 శ్రీవారి ఆలయం సమీపంలోని పురాతన గొల్ల మంటపంపై సీఎం ఆరా తీశారు. దీనిని కూల్చకపోతే ప్రమాదమని ఇటీవల నిపుణులు హెచ్చరించారు. అయితే, తమ మనోభావాలతో ముడిపడి ఉన్న మంటపాన్ని కూల్చివేస్తే అడ్డుకుంటామని యాదవసంఘ నేతలు హెచ్చరించారు. టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఈ వివాదాన్ని ఆయనకు వివరించారు. ఎవరి మనోభావాలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని జేఈవోకు సీఎం సూచించినట్టు తెలిసింది. కాగా తిరుమల శ్రీవారి ట్రస్టులకు చెన్నైకి చెందిన టీబీ. రావు అనే భక్తుడు గురువారం  రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు.

మరిన్ని వార్తలు