ఫైనల్‌ తర్వాత క్లాస్‌ పీకాడనే.. తీసేశారా?

21 Jun, 2017 16:18 IST|Sakshi
ఫైనల్‌ తర్వాత క్లాస్‌ పీకాడనే.. తీసేశారా?

గత ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌ చేతిలో 180 పరుగుల తేడాతో బిత్తరపోయేరీతిలో ఓటమిని టీమిండియా మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాత డ్రెసింగ్‌ రూమ్‌ ఒక్కసారిగా వేడెక్కిందని సమాచారం. ఈ మ్యాచ్‌లో ఓటమితో నిరాశలో ఉన్న క్రికెటర్లకు కోచ్‌ కుంబ్లే దాదాపు అరగంటపాటు క్లాస్‌ పీకాడని తెలుస్తోంది. డ్రెసింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లను కుంబ్లే చెడామడా కడిగిపారేయడంతోనే ఆయనను బలవంతంగా కోచ్‌ పదవి నుంచి తొలగించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోందని ‘ఇండియా టుడే’ ఓ కథనంలో పేర్కొంది.

కెప్టెన్‌తో తనకు సత్సంబంధాలు లేకపోవడంతో కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కుంబ్లే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నిజానికి బీసీసీఐ టీమిండియా కోచ్‌గా అనిల్‌ కుంబ్లే కొనసాగాలని కోరుకుంది. సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ నేతృత్వంలో కోచ్‌ పదవి ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీ (సీఏసీ) కూడా కోచ్‌గా కుంబ్లే కొనసాగితే బాగుంటుందని సిఫారసు చేసింది. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత కుంబ్లేతో తమకు సరిపడదని ఆటగాళ్లు బీసీసీఐకి చెప్పడంతో అదే విషయాన్ని బీసీసీఐ కుంబ్లేకు చేరవేసింది. దీంతో తాను తప్పుకోవడం తప్ప మరో గత్యంతరం లేకపోవడం, తనను కాదనుకుంటున్న వారితో బలవంతంగా కలిసిసాగడం ఇష్టంలేకపోవడంతోనే కుంబ్లే కూడా రాజీనామాకు సిద్ధపడ్డట్టు సమాచారం. భారత క్రికెట్‌ జట్టులో నెలకొన్న సూపర్‌ స్టార్‌ సంస్కృతే కుంబ్లే అర్ధంతరంగా తప్పుకోవడానికి కారణమని విమర్శలు వస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు