మద్యం దుకాణాల లెసైన్సు ఇక రెండేళ్లు

7 Sep, 2015 02:46 IST|Sakshi
మద్యం దుకాణాల లెసైన్సు ఇక రెండేళ్లు

నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

     ఏడాదికి 10% మేర పెరగనున్న లెసైన్సు ఫీజు
     దరఖాస్తు ఫారం ధర
     రూ. 25 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు
     2,216 దుకాణాలకు లెసైన్సులు మంజూరు చేయనున్న ప్రభుత్వం
     జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 503 షాపులు
     దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతి


 సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈసారి రెండేళ్ల కాలపరిమితితో దుకాణాలకు లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. జూలై నుంచి ఎక్సైజ్ విధానం అమల్లోకి రావాల్సి ఉన్నా.. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం అక్టోబర్‌కు వాయిదా వేసింది. చీప్‌లిక్కర్ ప్రతిపాదనలపై పలు వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో పాత పద్ధతిలోనే ఎక్సైజ్ లెసైన్సులు జారీ చేయాలని సీఎం నిర్ణయించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ(ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

సోమవారం నుంచి చైనా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని సవరణలతో మద్యం విధానాన్ని ఆమోదిస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న విధానంలోనే మద్యం దుకాణాల లెసైన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటిదాకా ఏడాది కాలానికి లెసైన్సు జారీ చేసేవారు.. ఇప్పుడు దాన్ని రెండేళ్లు చేశారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి, జనాభా ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తారు. దుకాణాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తే జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా లెసైన్సులు జారీ చేస్తారు. ఈ నెల 30లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
 లెసైన్సు ఫీజు పెంపు
 రాష్ట్రంలో ప్రస్తుతం 2,216 మద్యం దుకాణాలకు లెసైన్సు జారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 503 షాపులుండటం గమనార్హం. జనాభా ప్రాతిపదికన ఈ దుకాణాల సంఖ్యను నిర్ణయించారు. అలాగే లెసైన్సు ఫీజు కూడా జనాభా ప్రాతిపదికనే నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న లెసైన్సు ఫీజును ఏడాదికి పది శాతం పెంచుతూ రెండేళ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించడంతో మొత్తంగా ఈ ఫీజు 20 శాతం పెరగనుంది. ఉదాహరణకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక దుకాణం లెసైన్సు ఫీజు రూ.90 లక్షలు ఉండగా.. పదిశాతం అదనంగా అంటే రూ. 9 లక్షల దాకా పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు ఏడాదికి కోటి రూపాయల చొప్పున రెండేళ్ల కాల పరిమితికి ఫీజు వసూలు చేయనున్నారు.
 2017 జూన్ వరకు కొత్త విధానం..
 సాధారణంగా ఎక్సైజ్ సంవత్సరం జూలైతో మొదలై జూన్‌తో ముగుస్తుంది. కానీ ఈసారి ప్రభుత్వం గుడుంబాకు బదులుగా చౌక మద్యం తేవాలనే ఆలోచనతో దుకాణాల లెసైన్సుల గడువును మరో మూడు నెలలకు పొడిగించింది. దీంతో నూతన మద్యం విధానం ఈ అక్టోబర్ నుంచి మొదలవుతుంది. రెండేళ్ల పాటు ఇదే విధానం కొనసాగనుంది. 2017 జూన్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది.
 దరఖాస్తు ఫారం ధర రూ.50 వేలు!
 మద్యం దుకాణాల కోసం చేసుకునే దరఖాస్తు ధరను కూడా ప్రభుత్వం రెండింతలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా రూ. 25 వేలుగా ఉన్న దరఖాస్తు ఫారం ధరను రూ.50 వేలుగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ దరఖాస్తు ఫారానికి వెచ్చించే సొమ్ము తిరిగి రాదు (నాన్ రిఫండబుల్). పోటీ అధికంగా ఉండే దుకాణాలకు దరఖాస్తులు పెరిగితే ఎక్సైజ్ శాఖకు కాసుల పంటే. ఈ వారంలోపే నోటిఫికేషన్ జారీ చేసి, జిల్లాల వారీగా దరఖాస్తులను ఆహ్వానిస్తారు.


 ఇప్పటివరకు అమల్లో ఉన్న లెసైన్సు ఫీజులివి. ఏడాదికి 10 శాతం చొప్పున ఈ ఫీజులను పెంచే అవకాశం ఉంది.
http://img.sakshi.net/images/cms/2015-09/61441574198_Unknown.jpg
 
 

మరిన్ని వార్తలు