-

మహీంద్రా... బ్రాండెడ్ పండ్లు

22 Nov, 2013 01:05 IST|Sakshi
మహీంద్రా... బ్రాండెడ్ పండ్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:  సుమారు రెండు లక్షల కోట్ల విలువైన దేశీయ పండ్ల మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘సబొరో’ బ్రాండ్ పేరు మీద యాపిల్ పండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘సబొరో’ బ్రాండ్‌ను జాతీయ స్థాయిలో లాంఛనంగా ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే బ్రాండెడ్ పండ్లకు హైదరాబాద్ పెద్ద మార్కెట్ కావడంతో ‘సబొరో’ బ్రాండ్‌ను ఇక్కడ ప్రారంభించినట్లు ఎం అండ్ ఎం అగ్రి, అల్లైడ్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు. బ్రాండెడ్ పండ్లను పరిచయం చేసిన తొలి దేశీయ కంపెనీగా ఎంఅండ్‌ఎం రికార్డులకు ఎక్కిందనివచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సొంతంగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం లేదని, వివిధ రిటైల్ సంస్థల ద్వారా ఈ బ్రాండ్‌ను విక్రయించనున్నట్లు అశోక్ తెలిపారు.
 
 వచ్చే మూడేళ్లలో దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో 200 రిటైల్ ఔట్‌లెట్లలో సొబొరో బ్రాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెరిటేజ్ ఫ్రెష్, గోద్రేజ్ నేచుర్స్ బాస్కెట్ వంటి రిటైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరికొన్ని రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు అశోక్ వివరించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కింద యాపిల్‌ను మాత్రమే పరిచయం చేశామని, ఇక ధరల విషయానికి వస్తే దిగుమతి చేసుకున్న యాపిల్ ధరల కంటే 20 శాతం తక్కువగాను, దేశీయంగా అందుబాటులో ఉండే యాపిల్ కంటే 10 నుంచి 15 శాతం ధర అధికంగా ఉంటాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎగుమతి చేస్తున్న ద్రాక్ష పండ్లను ఈ సీజన్ మొదలు కాగానే దేశీయంగా కూడా విక్రయించనున్నట్లు తెలిపారు. గతేడాది రూ.65 కోట్ల ద్రాక్ష ఎగుమతులు చేయగా,  ఈ ఏడాది రూ.90 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దేశీయ అరటి పండ్లను, సిట్రస్, పీర్స్ వంటి విదేశీ పండ్లను పరిచయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించామని, భవిష్యత్తు విస్తరణ కోసం రూ.40 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సేకరించిన యాపిల్ పండ్లను హైదరాబాద్ శీతల గిడ్డంగుల్లో భద్రపర్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు అశోక్ వివరించారు.
 
 పులివెందుల రైతులతో చర్చలు
 రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను సేకరించడానికి వివిధ రాష్ట్రాల్లోన్ని రైతులతో కాంట్రాక్టింగ్ వ్యవసాయ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎం అండ్ ఎం శుభ్‌లాభా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ పురి తెలిపారు. రాష్ట్రంలో ద్రాక్షకు సంబంధించి 10 మంది రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అరటికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండించే కావిండిష్ రకం అరటి పండుకు మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించి అక్కడి రైతులతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంత రైతులపై దృష్టి పెట్టనున్నట్లు విక్రమ్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు